సప్త శనివార వ్రత కథ - శ్రీ వేంకటేశ్వర సప్త శనివారం - శనైశ్చర, శ్రీ వేంకటేశ సంవాదం
ఒకసారి శనైశ్చరునికి, మానవులెవ్వరూ తనని భక్తితో సేవించడం లేదనీ, భయంతో మాత్రమే పూజిస్తున్నారనీ విచారం కలిగింది. అప్పుడు వేంకటేశునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు.
‘స్వామీ! నా పేరువింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవడానికి, ఇంక నుంచీ నాకు ప్రీతి అయిన శనివారంనాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపైన నిన్నుపూజించినవారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలి’ అని కోరినాడు.
అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, ‘నీకోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకూ నాకూ భేదం ఏముంది? ఆరువారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు. నేను ఆరుకొండలు దాటాక ఏడవ కొండమీద ఉంటాను. నువ్వు నీల వర్ణుడివి, నేను ఆ వర్ణుడనే, నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్త గిరీశుడను. సామాన్యమానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నినూ నన్నూ వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి, ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శనిదోషాలనుంచీ విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్యైశ్వర్యాది సకల శ్రేయస్సులనూ పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు.’ అని వరమిచ్చాడు.
శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి, ‘ఈ సప్త శనివారవ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవ్వరైనా ఉంటే, వారి కథను వినిపించు’మని అతనిని అడిగారు. సూతుడు చెప్పడం ఆరంభించాడు.