ఓంభక్తి ఆరాధన

సప్త శనివార వ్రత కథ - శ్రీ వేంకటేశ్వర సప్త శనివారం - దేవదత్త దంపతుల శనివార వ్రత కథ

పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడు వేదవేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్నీ అభ్యాగతుల్నీ ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు. వారికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వేంకటేశ్వరస్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి, జాతకం ప్రకారంగా దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయనీ, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివారవ్రతం చేసి అటు శనైశ్చరుణ్ణీ, ఇటు శ్రీ వేంకటేశ్వరస్వామినీ భక్తిగా ఆరాధించవలసిందనీ చెప్పాడు. ‘అమ్మా! నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్తశనివారవ్రతం చెయ్యడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా!’ అని హెచ్చరించాడు. సప్తశనివార వ్రత విధానాన్ని బోధించాడు.

దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మ ముహూర్తాన లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి, ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి, వేంకటేశ్వరస్వామి చిత్రపటం పెట్టి, నైవేద్యానికి కొబ్బరి కాయలూ, అరటిపళ్ళూ, నల్లద్రాక్షపళ్ళూ, 7 చిమ్మిలి ఉండలూ సిద్ధం చేసుకుని ఉదయం పూజచేసి, ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనము పెట్టి ఆపైన వారు భుజించి మొదటిరోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు.

ఏడవ శనివారం వ్రతపరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వేంకటేశ్వరస్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తిశ్రద్ధలకు, పూజా విశేషాలకూ ప్రసన్నుడై శ్రీ వేంకటేశ్వరస్వామి మాలినీ దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ‘ఓ పరమసాధ్వీ! మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతుష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనైశ్చరదోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాణ్ణి చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్ళు జీవించి ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు పురుషార్థాలూ సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి’ అని దీవించి అదృశ్యుడైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయనకూడా సంతోషించి భార్యను అభినందించాడు.

ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి, ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్నసంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకూ యథాశక్తిగా శ్రీ వేంకటేశ్వరస్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు.

‘కలౌ శ్రీ వేంకట నాయకః’ అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామిని మించిన ఆరాధ్యదైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయన నారాధించిన వారికి శనిదోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించాడు.

శ్రీస్వామి వారికి మిక్కిలి యిష్టమైన యీ శనివార వ్రతమును చేసినవారికి ఉన్న కష్టములు తీరును. గ్రహబాధలు పోవును. సంపదలు భోగములు కలుగును. వారికి వారి కుటుంబమునకు సర్వ శుభములు కలుగును. శనివారవ్రతము నాచరించినవారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివారవ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివారవ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి, యీ కథను చదువుకొనినవారు ధన్యులు. కావున మనము అందరమును యథాశక్తిగ శనివారవ్రతమును ఆచరించి శ్రీవేంకటేశ్వరస్వామి వారి యనుగ్రహమును పొందెదము గాక.

లోకాస్సమస్తాస్సుఖినో భవంతు

‹ ముందు అధ్యాయం

భక్తి ఆరాధన యాప్ తెరవండి →