సమస్య / పరిష్కారం - శ్రీ గురు చరిత్ర
వ్యాధి నివారణ (ఆరోగ్య సమస్యలు, శూల రోగం వంటివి)
13వ అధ్యాయం · గంగాపురం
భూమిం ప్రదక్షిణీ కృత్య, సశిష్యో వీక్ష్య మాతరం జహార ద్విజ శూలార్తిం, శ్రీ దత్త శ్శరణం మమ
అర్థం:
బ్రాహ్మణుడికి వచ్చిన భరించలేని కడుపు నొప్పి (శూల రోగం) నుండి విముక్తి. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః,
ప్రస్తావన :
ఈ అధ్యాయాలలో శ్రీ గురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు. పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాదిలాంటిది. అట్టి ధర్మానికి శృతి, స్మృతి, సదాచారము, ఆత్మ సంతృప్తి అన్నవి నాలుగు ప్రమాణాలు. కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటినీ హృదయగతం చేసుకొని, సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి. ఈ మూడింటికీ సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకొని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ, తృప్తిగాను ఆచరించగల్గడమే నాల్గవ ప్రమాణం. కాని శృతులకు అర్ధం చెప్పగలవారు, వాటి పరంగా స్మృతులనన్వయించగలవారు ఎవరు? అంత నిర్దుష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థతనొందినవారే సత్పురుషులు కనుక వారి వాక్యాలే, ఆచరణయే ప్రమాణం. కనుక ధర్మాన్ని గూడ వారివద్దనే నేర్వాలి. అది తెల్పడానికి ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి స్వయంగా శిష్యులకుపదేశించారు. ఆయనవలె ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయమివ్వగలవాడే సద్గురువు. ఆయనయే నాల్గు పురుషార్ధాలకూ ఉత్తమమైన మార్గం తెల్పగలవాడు, ప్రసాదించగలవాడు. సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటినాచరించడానికి సంసిద్ధులైనవారే తురీయాశ్రమాన్ని స్వీకరించ యోగ్యులని ఈ అధ్యాయం తెల్పుతుంది. అలా సుఖదుఃఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించ గలగాలంటే గూడ సద్గురుని అనుగ్రహమే శరణ్యం.
కథారంభము
శ్రీ గురుని కథ శ్రద్ధగా విని, పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, "స్వామీ, ఈ శ్రీగురుచరిత్ర ఎంత విన్నా తనివితీరడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను చవిచూచిన ఆకలిగొన్న ఆవువలె వున్నది. నేనెంత అల్పజ్ఞుడనో, నాకిప్పుడు తెలుస్తున్నది. అజ్ఞానం వలన భ్రష్టుడనై నేనే వెనుక కష్టాలు కొనితెచ్చుకున్నానని (శ్రీ గురుని పక్షాన యెట్టి లోపమూ లేదనీ) తెలుసుకున్నాను. అజ్ఞానాంధకారంలో దారి కన్పించకున్న నాకు జ్ఞానజ్యోతియైన మీరే శ్రీ గురుని చూపారు. మీ రూపంలో శ్రీగురుడే నన్ననుగ్రహించారు. మీరు చేసిన మేలుకు నేనెన్నటికీ మీ ఋణం తీర్చుకోలేను. కల్పవృక్షానికీ, చింతామణికీ, జ్ఞానమిచ్చిన వారికీ యేమిచేసి ప్రత్యుపకారం చేయగలము? మీ బోధ వలన నాకు సర్వార్థసాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది. దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడకు వెళ్ళారో, ఏమి చేసారో సెలవీయండి" అని ప్రార్ధించాడు.
సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సున చేయి పెట్టి, "నాయనా! నీ జన్మ ధన్యమయింది. శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటుచేసుకున్నాయి. కనుకనే యిలా కోరగల్గుతున్నావు. ఇందువలన నీవు తరించడమే గాక సాటివారిని గూడ తరింపజేయగలవు. నీవడుగుతుంటే మాకు గూడ ఆనందం కలుగుతున్నది" అని ఆ వివరాలిలా చెప్పారు.
శ్రీ గురుడు ప్రయాగలో వుండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి, యెందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు. మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము. మా అందరి పేర్లకూ చివర 'సరస్వతి' అనే బిరుదుంటుంది. శ్రీ గురుడు మమ్ములను మరికొందరు శిష్యులనూ వెంటబెట్టుకొని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణదేశం తిరిగి వచ్చి, పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన 'కారంజ' నగరం చేరారు. అపుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు.
వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ యింటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీ గురుడు అందరి ఆహ్వానాలూ అంగీకరించి, ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి యిళ్ళకూ వెళ్ళి భిక్ష చేసారు. అందరూ ఆ లీలకాశ్యర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవదవతారమని గుర్తించారు.
ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు. వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, "నాథా! క్రిందటి జన్మలో లోక పూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి, వారి ఆదేశానుసారం శని ప్రదోషపూజ చేసాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది" అని చెప్పింది.
అపుడా దంపతులు తమను సంసారసాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అపుడు శ్రీగురుడు, "ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో, ఆ వంశంలోని 42 తరాలవారు తరిస్తారు. ఆ కులమంతటికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు గూడ బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను గనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై, అష్టశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను, మనుమలను చూడగల్గుతారు. చివరిదశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది, వేదాల చేత కీర్తించబడినదీ అయిన కాశీలో మీరు నివసిస్తారు. మీకు యెట్టి చింతా అవసరము లేదు" అని అభయమిచ్చారు.
అపుడు, పూర్వాశ్రమంలో స్వామివారి సోదరియైన రత్న ఆయనకు నమస్కరించి, "స్వామి, నాకు గూడ సంసార తాపత్రయం తొలగించి, నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను" అని ప్రార్థించింది.
అపుడు శ్రీగురుడు నవ్వి, "అమ్మా, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది; అభీష్టాలు గూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు. గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది" అన్నారు.
అప్పుడామె, "స్వామీ! మీరు త్రికాలజ్ఞులు, నా ప్రారబ్ధమెలా వున్నదో, నా భవిష్యత్తేమో తెల్పండి" అని కోరింది.
శ్రీగురుడు, "నీ సంస్కారం తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా వున్న దంపతులకు తగవుపెట్టి, వారిని విడదీశావు. అందువలన యీ జన్మలో నీ భర్త నిన్ను విడిచి, సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీవొక ఆవును కొట్టి చంపావు. అందువలన నీకీ జన్మలో కుష్టురోగమొస్తుంది" అని చెప్పారు.
వెంటనే రత్న, భయంతో ఏడుస్తూ ఆయన పాదాలమీద పడి, "గురుదేవా, నన్ను రక్షించండి" అని వేడుకున్నది. శ్రీ గురుడామెను ఓదార్చి, "అమ్మా, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్టురోగమొచ్చినపుడు మా దర్శనమవుతుంది. నీకు కుష్టురోగం పొడచూపగానే దక్షిణ దిక్కునవున్న భీమానదీ తీరంలోని పాపవినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమా - అమరజా నదీ సంగమం దగ్గరనున్న గంధర్వపురంలో ఆ తీర్థమున్నది" అని చెప్పి, శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయల్దేరారు.
రాజదండన (కోర్టు కేసులు, ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చే కష్టాలు)
14వ అధ్యాయం · గంగాపురం
శిష్యత్వేనోరరీకృత్య, సాయం దేవం రరక్ష యః భీతంచ క్రూర యవనాత్, శ్రీ దత్త శ్శరణం మమ
అర్థం:
రాజదండన/శత్రు భయం నుండి రక్షణ: క్రూరమైన రాజు (యవనుడు) నుండి శిష్యుడైన సాయం దేవుడిని రక్షించడం. కోర్టు కేసులు, అధికారుల నుండి వచ్చే కష్టాల నివారణ కోసం.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః.
నామధారకుడు, "స్వామీ! అటు తర్వాత శ్రీగురుడు యేమేమి చేసారో చెప్పండి" అన్నాడు. సిద్ధయోగి సంతోషించి యిలా చెప్పారు: భోజనాలయ్యాక సాయందేవుడు శ్రీగురుని పాదాలొత్తుతూ, 'సద్గురూ! మీ పాదసేవ వలన నా జన్మ, సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు గూడ తరించారు. ధన్యుణ్ణి. మాయచేత మానవునిలా కన్పిస్తు న్నారే గాని, మీరు సాక్షాత్తూ భక్తులనుద్దరించడానికి అవతరించిన భగవత్స్వరూపులే. మీ మహిమ వేదాలకే అంతుబట్టినిది. అట్టి మీకు సేవచేసే అవకాశం నాకను గ్రహించి నా వంశాన్నే పావనం చేసారు. కాని నాదొక విన్నపమున్నది: ప్రస్తుతము నేనొక కష్టంలో వున్నాను. వేరుదారిలేక, నేనొక యవనరాజు సేవలో వున్నాను. అతడు నరరూపరాక్షసుడే అతడు ప్రతిసంవత్సరమూ ఒక బ్రాహ్మణుని చంపుతాడు. నన్ను బలివ్వాలని తలచి, యింతకు ముందే నాకు కబురు పంపాడు. నేనిప్పుడతని వద్దకు వెళ్ళాలి. తప్పదు. నన్ను మీరే కాపాడాలి' అన్నాడు.
శ్రీగురుడు అతని తలపై చేయిపెట్టి ఆశీర్వదించి, 'నాయనా! భయపడకు. ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు. భగవంతుడు సర్వానికీ యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేమిక్కడే వుంటాము. దీర్ఘాయుష్మాన్ భవ!' అని పంపారు.
సాయందేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయందేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు. అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము, చనిపోతున్నంత బాధ కలిగి, స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడతనికొక స్వప్నమొచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కన్పించి, విపరీతమైన బాధ కల్గింది. అతనికి స్పృహ వచ్చేసరికి, తాను చేస్తున్న హింస యితరులకెంత బాధాకరమో తెలిసివచ్చింది. పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి, సాయందేవుని పాదాలపై పడి, 'అయ్యా! మిమ్మల్ని నేను పిలిపించలేదే! మీరు యింటికి వెళ్ళవచ్చు' అని, వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు!
సాయందేవుడు శ్రీ గురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరత్వరగా తన గ్రామం చేరి శ్రీ గురునితో జరిగినదంతా చెప్పాడు. ఆయన సంతోషించి, 'నాయనా! మేము పుణ్యతీర్ఠాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము' అన్నారు. అతడు నమస్కరించి, 'స్వామీ! నాకు మీరు ప్రసాదించిన ఈ జీవితశేషాన్ని మీ సేవకే అంకితము చేస్తాను. అనుగ్రహించండి. మీ పాదసన్నిధి విడిచి బ్రతుకలేను. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు. నేను కూడా మీ వెంట వస్తాను' అని వేడుకున్నాడు.
శ్రీ గురుడు, 'నాయనా! నాకు ఆత్మ సమర్పణం చేసుకున్నావు. నీ అభీష్టం నెరవేరుతుంది. మేమొక పనిమీద వెళ్తున్నాము. 16 సం॥లకు మళ్ళీ మేము వచ్చి, ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము. నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకూ యిక్కడే సుఖంగా వుండు' అని ఆశీర్వదించి, శిష్యులతో కలిసి పాదచారియై అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాధం చేరారు. అక్కడాయన కొంతకాలం గుప్తంగా నివసించారు".
అది విని నామధారకుడు, "స్వామీ! అపుడు శ్రీ గురునితో అనేకమంది శిష్యులున్నారు గదా! వాళ్ళెక్కడున్నారు? శ్రీ గురుడు అక్కడ గుప్తంగా వుండి ఏమిచేసారు?" అని అడిగాడు.
శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
విద్యాప్రాప్తి (జ్ఞాన సముపార్జన, పిల్లలలో మందబుద్ధి నివారణ)
17వ అధ్యాయం · బిల్వతి (ఔదుంబర్)
విద్వత్సుత మవిద్యంయ, ఆగతం లోక నిందితం ఛిన్న జిహ్వం బుధం చక్రే, శ్రీ దత్త శ్శరణం మమ
అర్థం:
విద్యాప్రాప్తి/బుద్ధి మాంద్యం నివారణ: జ్ఞానప్రాప్తి లేని (మందబుద్ధి) పండితుని కుమారుడిని గురువు అనుగ్రహంతో విద్వాంసుడిగా మార్చడం. విద్య, జ్ఞానం మరియు గ్రహణశక్తి కోసం.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన : ఈ 17, 18, 19 అధ్యాయాలలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరపురము (నరసోబావాడీ) క్షేత్ర మహాత్మ్యాన్ని, అక్కడ శ్రీ గురుడు చేసిన లీలలనూ వర్ణిస్తుంది. ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై తమ చేయి పెట్టి సకల విద్యాపారంగతుడుగా చేశాడు. ఇలాటి లీల శ్రీ స్వామి సమర్థులు (1856-78) జీవిత చరిత్రలో చూడవచ్చు. పేద బ్రాహ్మణ దంపతులకు భుక్తి, ముక్తులను ప్రసాదించాడు. ఇలాటి లీలలు గూడ శ్రీ స్వామి సమర్థ, శ్రీ శిరిడీ సాయిబాబా జీవిత చరిత్రలలో చూడవచ్చు. గంగానుజుడనే భక్తుడిచేత క్షణకాలంలో త్రిస్థలి, కాశీ, ప్రయాగ, గయ క్షేత్రాల యాత్ర చేయించాడు. ఇలాటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవితచరిత్రలో చూడవచ్చు. శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికీ ఎలాటి సద్గురు రూపాలలో మానవులనుద్ధరిస్తున్నారో వీరి చరిత్రలలో చూడవచ్చు. అది గుర్తుంచుకొని మనమీ పారాయణ చేయాలి. శ్రద్ధాయుతమైన యీ అధ్యాయం పారాయణ ఆయా క్షేత్రదర్శనంతో సమానం. దేవి తననాశ్రయించిన విద్యాహీనుడితో శ్రీ గురువునాశ్రయించమని చెప్పిన లీల సప్తశృంగిదేవి కాకాజీ అనే భక్తుడితోను. చిన్న కిస్నా అనే భక్తునితో స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంతో సరిపోతుంది. దేవతల కంటే సద్గురువు అధికుడని యీ లీలలకర్థం. శ్రీ రామకృష్ణ పరమహంసతో కాళీమాత గూడ అద్వైతానుభూతిని పొందడానికి తోతాపురియనే గురువును ఆశ్రయించమనడం గమనార్హం. ఇష్టదేవతోపాసన విక్షేపదోష నివృత్తి కోసమేనని, ఆత్మజ్ఞానానికై శ్రోత్రియుడూ, బ్రహ్మనిష్ఠుడూ అయిన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దానినే ఈ లీలలు బలపరుస్తాయి. ముముక్షువుకు సద్గురువును ఆశ్రయించడం అత్యావశ్యకమని యీ అధ్యాయం తెల్పుతున్నది. మానవ మాత్రుడైన గురువునాశ్రయించిన వారిని గూడ ఆ రూపంలో అనుగ్రహించి తరింపజేయవలసినది సద్గురువేనని క్రిందటి అధ్యాయంలోని చివరి లీల తెల్పు తున్నది. శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపినని భక్తులకనుభవమిచ్చిన లీలనెంతగానో యిది పోలియున్నది. కనుకనే శ్రీ గురుడు స్వయంగా పురాణోక్తమైన గురుసేవా వృత్తాంతాలను క్రిందటి అధ్యాయంలో చెప్పాడు.
కథారంభము
సిద్ధముని యింకా యిలా చెప్పారు: "నాయనా, మబ్బువేసేముందు చల్లనిగాలి వీచినట్లు, గురుకథ వినడంలో నీకు, అది విన్పించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని భక్తులపాలిట కామధేనువు, కల్పవృక్షము అయిన యీ శ్రీ గురుచరిత్ర చెబుతాను విను : శ్రీ గురుడు కృష్ణాతీరంలో భిల్లవటి వద్దనున్న మెడిచెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాస్యం చేసారు. అది వినగానే నామధారకుడు నమస్కరించి. "స్వామీ, భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్టానము యెందుకు చేసారు? అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకొనడమెందుకు?” అని అడిగాడు. సిద్ధయోగి, "నాయనా! భగవంతుడైన శివుడు, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడూ భిక్ష చేయలేదా? మహాత్ములు తీర్థయాత్ర చేయడము, తపస్సు చేయడముగాని, భిక్షమెత్తడం గానీ భక్తులనుద్ధరించడానికి, సాధకులకు సన్మార్గము తెలియజెప్పడానికీ మాత్రమే చేస్తారు. అలానే శ్రీగురుడు గూడ భిక్షావృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమతీర్థాల నెన్నింటినో తిరిగి ప్రకటం చేయడానికే తీర్ధయాత్రలు చేసారు. కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించేమూర్ఖులు, స్వార్థపరులు తమనాశ్రయించకుండా చూచుకోడానికి ఆయన కొంతకాలం గుప్తంగా వున్నారు. కాని సూర్యుని తేజస్సు, కస్తూరి వాసన ఎలా దాగివుండలేవో అలాగే శ్రీగురుని మహిమగూడ ఒకనాడీ విధంగా వెల్లడయింది; కరవీరపురంలో వేదశాస్త్రపురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడు కణ్వశాఖీయుడు, మహా పండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కాని అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి గావడంతో చదువు ఏ మాత్రమూ రాలేదు, మేనమామ, గ్రామస్థులతోగలిసి అతనికి 7వసం॥లో ఉపనయనం చేసాడు. కాని మతిమరుపువల్ల అతడు గాయత్రీ మంత్రానుష్టానం గూడ చేయలేకపోయేవాడు. ఉపనయనం చేసిన ఒక సంవత్స రానికే మేనమామ గూడ మరణించడంతో అతడు అనాధుడై భిక్షకెళ్ళేవాడు. ఊళ్ళోని జనం అతనిని, 'ఒరే మందమతీ! అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకిచావరాదా? నీ జన్మం వ్యర్ధం, విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా, అతనెక్కడికి వెళ్ళినా సోదరునివలె విద్య అతని వెంటనుండి అతనికి కీర్తి, గౌరవము లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వదేవతలు నివశిస్తారు. గనుక, అతడు వయోవృద్ధులకు గూడ పూజ నీయుడే. విద్యలేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతనినెవరూ ఆదరించరు. విద్యలేని నీవు పశువు కంటే హీనం', అని హేళన చేసేవారు. అతడందుకు బాధపడి, 'అయ్యా మీరు చెప్పినది నిజమేగాని, నేనేమి చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు గాబోలు, నాకీదుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి' అని ప్రాధేయపడేవాడు. అతనికి విద్య చెప్పిచెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, 'నీకిక జన్మలో విద్యరాదు. నీవు భిక్ష చేసుకుని బ్రతకడానికి గూడ పనికిరావు. నీవలన నీ వంశమే భ్రష్టమైంది', అని నిందించేవారు. ఆ పిల్లవాడు తన దుస్ధితికి నిస్పృహ చెంది, యిల్లు విడిచి భిల్లవటి చేరి, కృష్ణానదికి తూర్పదిక్కున వున్న భువనేశ్వరీ దేవిని దర్శించి, అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా మూడురోజులు గడిచినా ఆ తల్లి దర్శనమీయకపోయేసరికి. అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాలవద్ద పెట్టి, 'అమ్మా! నీవు గూడ నన్ననుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి, నీ యెదుటనే ప్రాణాలు విడుస్తాను' అని చెప్పు కున్నాడు. నాటి రాత్రి, దేవి అతడికి కలలో కనిపించి, 'నాయనా! నాపై అలుగవద్దు. కృష్ణానదికి పడమటి తీరాన వున్న మేడి చెట్టుక్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము. అపారశక్తిమంతుడు. నీ కోరిక తీర్చగలడు'. అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయల్దేరి, శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమ స్కారము చేసాడు. శ్రీ గురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయినుంచి ఆశీర్వదించారు. అతనికి వెంటనే నాలుక రావడమేగాక, సకల విద్యలూ Siddhañాయి. కాక్ మానససరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరశువేది స్పర్శతో యినుము బంగారమైనట్లు, శ్రీ గురుని హస్త స్పర్శవలన ఆ విప్ర కుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమ గలది.
శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ పాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
ఋణ బాధా నివారణ (అప్పుల సమస్యల నుండి విముక్తి)
18వ అధ్యాయం · నరసోబావాడి
నృసింహ వాటికాస్థోయం, ప్రదదౌ శాఖ భుజ్ నిధిం దరిద్ర బ్రాహ్మణాయా సౌ, శ్రీ దత్త శ్శరణం మమ
అర్థం:
దారిద్య్ర నివారణ/ధనప్రాప్తి: పేద బ్రాహ్మణుడికి నరసింహ వాటికలో నిధిని (ధనాన్ని) ప్రసాదించడం. పేదరికం నుండి విముక్తి మరియు సంపద కోసం.
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు, "స్వామీ! శ్రీ గురుని లీలలు యింకా వినిపించ వలసింది" అని ప్రార్ధించాడు. సిద్దయోగి యిలా చెప్పారు: నాయనా! అంతవరకూ గుప్తంగా వున్న శ్రీగురుని మహిమ ఈ లీలవలన లోకానికి వెల్లడయింది. ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై, అచ్చటినుండి వరుణా సంగమం చేరి, అక్కడినుండి కృష్ణాతీరంలో నున్న తీర్థాలలో స్నానం చేస్తూ, కృష్ణ-పంచనదీ సంగమానికి వెళ్ళి, అక్కడ 12 సం॥లు నివశించారు. అక్కడ శివ, భద్ర, భోగవతీ కుంభీ, సరస్వతీ అను మహాపవిత్రమైన అయిదు నదులూొక్కటై కృష్ణానదిలో కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాలలో గూడా మనోహర తీర్ధమని ఎంతగానో కీర్తించబడింది. అక్కడెన్నో తీర్థాలు వున్నాయి. అక్కడినుండి తూర్పున అమరపురమనే గ్రామంలో అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు నివసిస్తున్నారు. అచ్చటి అమరేశ్వర లింగం సాక్షాత్తూ కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణీ నదితోకలిసిన కృష్ణ, దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది. అక్కడకు ఉత్తర దిక్కున శుక్ల తీర్థము, ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశతీర్థము, కామ్య తీర్ధము, వరద తీర్థము వున్నాయి. సంగమంలో శక్తి తీర్ధము, చామర తీర్ధము, కోటి తీర్ధము వున్నాయి. అవన్నీ అపారమైన మహిమ గలవే. అచ్చటి కృష్ణా - పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థక్షేత్రము. దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి. అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తూ కల్పవృక్షము. ఆ క్షేత్రమహిమను వెల్లడి చేయడానికే శ్రీగురుడక్కడ అంతకాలం నివసించారు. శ్రీ నృసింహ సరస్వతీస్వామి ప్రతిరోజూ భిక్షకు అమరపురానికి వెళుతుండే వారు. ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడుండేవాడు. అతడు పరమ సాత్త్వికుడు. కేవలం యాయవార వృత్తితో జీవిస్తూండేవాడు. అతనికొక కుమారుడు, ఒక కుమార్తె వున్నారు. అతడి యింటిముందు తమ్మపాదు ఒకటి వుండేది. అతనికి గ్రామంలో గింజలు లభించనప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకుని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచ యజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ, అతిథు లను తమ శక్తిననుసరించి సేవిస్తూండేవాడు. ఒకరోజు శ్రీగురుడు అతని యింటికి భిక్షకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు. ఆరోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ యింటిముందున్న తమ్మ కాయలు కోసి వండి, స్వామిక్ దానినే సమర్పించారు. తర్వాత స్వామి, వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, 'మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము. నేటితో మీ దారిద్య్రం తీరిపోయింది' అని చెప్పి, నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి, దాని కొమ్మలను త్రుంచివేస్తూ త్వరత్వరగా వెళ్ళిపోయారు. అది చూచి ఆ యిల్లాలు ఎంతో దుఃఖించి, 'అయ్యో! స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి? మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే! మనం జీవించేదెలా?' అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు. 'సర్వమూ ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారబ్దాన్ననుసరించి జరుగుతుంది. చీమల దగ్గరనుండి సర్వజీవులకు ఆయువు, ఆహారము ప్రసాదిస్తాడేగాని, ఆయన మనకెందుకు కీడు చేస్తారు? ఏదైనా మన కర్మననుసరించే జరుగుతుంది. నీవు బాధపడవద్దు' అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు. గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దమొచ్చింది. అక్కడ త్రవ్వి చూడగా, ఒక రాగిబిందె నిండుగా బంగారు నాణాలున్నాయి. అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి, 'చూచావా? స్వామి ఈ లతను పీకివేయడంవల్లనే ఈ నిధి మనకు దొరికింది. ఆయన సాక్షాత్తూ పరమేశ్వరుడే అని చెప్పాడు. వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు. అప్పుడు శ్రీగురుడు, 'నాయనా! నీవీ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. చెబితే సంపద నశిస్తుంది. స్వధర్మాన్ననుసరిస్తూ, భోగభాగ్యాలనుభవించి, తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు' అని దీవించి పంపారు".
శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
వ్యవసాయం/పాడి సంపద వృద్ధి (పశువులు, వ్యవసాయంపై ఆధారపడిన వారికి)
22వ అధ్యాయం · భీమా-అమరజ సంగమం (గంగాపురం)
దోహయామాస భిక్షార్ధం, యో వంధ్యాం మహిషీం ప్రభుః దారిద్ర్య దావదావస్సః, శ్రీ దత్త శ్శరణం మమ
అర్థం:
అఖండ ఐశ్వర్యం/వ్యవసాయ వృద్ధి: గొడ్డుటావు (ఈనని మహిషి) నుండి పాలు పితికి, బ్రాహ్మణుడి దారిద్య్రాన్ని పూర్తిగా తొలగించడం. వ్యవసాయం, పాడి సంపద మరియు వృత్తిలో అభివృద్ధి కోసం.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన
22, 23, 24 అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విశద పరుస్తాయి : త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువు సర్వ సమర్థుడు. ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే. శ్రీ అక్కల్కోట స్వామి లాగ శ్రీ గురుడు గూడ మాటమాత్రం చేత ఒక గొడ్డు బజ్జెను పాడి గేదెగా మార్చాడు. ఇష్ట దేవతోపాసన సద్గురువును ఆశ్రయించడంతో గాని సఫలం గాదని, సద్గురువు సకల దేవ స్వరూపమని, విశ్వరూపుడని "శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర" లాగ, ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెల్పుతుంది. అంతేగాక ఇంకా యీ క్రింది అంశాలు గూడ గమనించదగినవి. (1) అతనివంటి సన్న్యాసులకు, పండితులకు గూడ ధర్మసూక్ష్మం తెల్పవలసినవాడు శ్రీ గురునివంటి సద్గురుడే. (2) కుమశీ గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు, పరివారమూ గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు. సద్గురు భక్తులైన సంసారులు గూడ అంతరంగంలో నిష్కాములైన సన్న్యాసులే. సద్గురువు నాశ్రయించని సన్న్యాసులు గూడ ద్వంద్వాలను విడువని సంసారులు గానే వుండిపోతారు. కథారంభము నామధారకుడు, “సిద్ధమునీ, మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి, జ్ఞానోదయమైంది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేనువు వంటి శ్రీగురుచరిత్ర నాకు వినిపించి నాలో గురు భక్తిని వికసింపజేస్తున్నారు. శ్రీ గురుకథ నా మనసును హరిస్తున్నది. అటుపైన ఏమి జరిగిందో సెలవీయండి" అని ప్రార్ధించాడు. సిద్ధయోగి, “నాయనా, నీకు గురుకృప లభించింది. నీకు యీ కథ వినిపించడం వల్ల నా జన్మ గూడ ధన్యమయింది. అటు తర్వాత శ్రీ గురుడు ఈ గంధర్వపురం చేరి, భీమ-అమరజా సంగమంలో నివసించడం వలన యీ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవు తున్నది. ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తరదిక్కుగా ప్రవహిస్తాయి. కనుక యిది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి. ఇక్కడ గూడ శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్యనివాసం చేస్తున్నారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ, దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు. ఆ గ్రామంలో సుమారు వంధ బ్రాహ్మణ కుటుంబాలుండేవి. వారంతా వేదవిదులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణు డుండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బజ్జె వుండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మొ॥నవి మోయించుకోడానికై అద్దెకు తీసుకెళ్తుండేవారు. అతడు యాయవారం (భిక్షాటన) తోనూ, గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవనం సాగిస్తుండేవాడు. శ్రీనృసింహసరస్వతీ స్వామి తరచు వీరింటికి భిక్షకు వెళ్ళేవారు. అదిచూచి కొందరు గ్రామస్థులు విమర్శిస్తుండేవారు. శ్రీకృష్ణుడు దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక, పేదవాడైన విదురుని యింటికే వెళ్ళాడు. భగవంతునికి సత్త్వగుణమందే ప్రీతిగాని, ధనమదంలో చిక్కినవారితో ఆయనకేమి పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి గూడ సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి గూడ మారవలసిందే! ఒక వైశాఖమాసంలో మధ్యాహ్నపుటెండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీగురుడు వాకిట్లో నిలచి, 'భవతీ భిక్షాం దేహి' అన్నారు. ఆ యిల్లాలు నమస్కరించి, 'స్వామీ, యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు. వారొచ్చే సమయమైంది. కోపగించక దయతో కొద్దిసేపు మీరీ ఆసనం మీద కూర్చోండి' అని, పీట వేసింది. శ్రీ గురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో, 'నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు. మాకు భిక్షే యివ్వనవసరం లేదు. మీ ముంగిట వున్న బజ్జె పాలు కొంచెమిచ్చినా చాలు!' అన్నారు. అప్పుడామె, 'స్వామీ! ఇది గొడ్డుబజ్జె. ఒక్కసారైనా కట్టనూలేదు. ఈననూలేదు. ఇప్పుడిదెంతో ముసలిది. పళ్ళుగూడ వూడిపోతున్నాయి. దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము' అన్నది. శ్రీ గురుడు అదేమీ పట్టించుకోక, 'ఎందుకు యీ వట్టి మాటలు? అయినా పాలు పితుకు చూస్తాము!' అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం! ఆ గొడ్డుబజ్జె రెండుపాత్రలు నిండుగా పాలు యిచ్చింది. ఆ యిల్లాలు ఆశ్చర్యపడి, ఆ యతీశ్వరుడు సాక్షాత్తూ పరమేశ్వరుడేనని తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలుత్రాగి సంతోషించి, 'అమ్మా, మీరు అఖండైశ్వర్యంతోనూ, పుత్రపౌత్రులతోనూ సుఖించగలరు' అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు యింటికి వచ్చి, జరిగిన వింత తెలుసుకుని, భార్యతో గూడ సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది" అన్నారు సిద్ధయోగి.
శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
సంతానప్రాప్తి (పిల్లలు లేని సమస్య పరిష్కారం)
39వ అధ్యాయం · గంగాపురం (మఠంలో)
అశ్వధ్ధ సేవామాదిశ్య, పుత్రం యోదాత్ఫలప్రదః చిత్ర కృత్ వృధ్ధ వంధ్యాయై, శ్రీ దత్త శ్శరణం మమ
అర్థం:
సంతానప్రాప్తి: వృద్ధురాలైన ఒక గొడ్రాలికి అశ్వత్థ వృక్ష సేవను ఆదేశించి, పుత్రుడిని ప్రసాదించడం. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కోసం.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః
కథారంభము సిద్ధయోగి యింకా యిలా చెప్పారు: 'గంధర్వపురంలో సోమనాధుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడుండేవాడు. అతనిది ఆపస్తంబశాఖ, శౌనక గోత్రం. అతని భార్య గంగాంబకు 60 యేళ్ళునిండినా సంతతి కల్గలేదు. ఆమె నిత్యమూ శ్రీగురుని దర్శించి, వారి పాదాలను పూజించి, ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది. ఇలా ఆమె కొన్ని సం॥లు తదేక దీక్షతో చేస్తుండేది.
ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా యిల్లాలితో, 'అమ్మా! ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు. నీ అభీష్టమేమిటో యెన్నడూ చెప్పలేదే? ఇప్పటికైనా చెబితే గౌరీనాధుని కృపవలన నీకోరిక నెరవేరుతుంది' అన్నారు. ఆమె యెంతో సంతోషించి దోసిలి యొగ్గి కన్నీరు కారుస్తూ యిలా చెప్పుకొన్నది: 'స్వామీ! కొడుకులు లేని వారికి పుత్తమగతులుండవుగదా. అందువలన గొడ్రాలుగా వుండడమే మహాదోషమైంది. నేను మహ పాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కల్గలేదని అందరూ నన్ను ఏవగించుకొంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలుగదు కదా! పితృదేవతలు గూడ, తమ కులంలో ఒక మగ బిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని యెంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. బిడ్డలు లేని యిల్లు యిల్లేగాదు. అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకొనే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 యేళ్ళు నిండిపోయాయి. మాకు, మా పితృదేవతలకు తిలోదకాలిచ్చే వాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయె! స్వామీ, అయిందేదో అయిపోయింది. మరుజన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి, చాలు' అని ఆయన పాదాలకు నమస్కరించింది.
శ్రీగురుడు నవ్వుతూ, 'ఓసి పిచ్చితల్లీ. ఏమి కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మసంగతి యిప్పుడెందుకు? అపుడు బిడ్డలు గలిగినా, వాళ్లు మేమిచ్చిన వరంవలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది? నీవునిత్యమూ మమ్మల్నింత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది. కనుక నీవు కోరినది యీజన్మలోనే లభించేలా వరమిస్తున్నాము. కొద్దికాలంలోనే నీకు ఒక కూతురు, ఒక కొడుకూ కలుగుతారు' అని ఆమెను దీవించారు.
అపుడు గంగాంబ తన కొంగును ముడివేసుకొని స్వామికి నమస్కరించి, "స్వామీ, ఒక మనవి చేసుకుంటాను. నాపై కోపగించవద్దు. నేను బిడ్డలకోసం యెన్నో తీర్ధయాత్రలు చేశాను. పుణ్యతీర్థాలలో స్నానం చేశాను. రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతాయని లోకులు చెప్పింది నమ్మి. కనిపించిన రావిచెట్టుకల్లా యింతవరకూ ప్రదక్షిణలు, నమస్కారాలు చేసి చేసి అలసి పోయాను. అలానే నా వయస్సంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరమెలా ఫలించగలదా అని ఆలోచనగా వున్నది. అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు యెన్నటికీ వ్యర్థం గాదన్న ధైర్యం లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే యిలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకూ నాకు కల్గిన సందేహమిది-నేను వచ్చే జన్మలో నైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే, మీరు యిప్పుడే ప్రసాదిస్తా మన్నారు. అయినప్పటికీ యిన్నాళ్ళుగా నేను కాళ్ళునొప్పులు పుట్టేలాగా రావిచెట్లకు ప్రదక్షిణం చేసినందువల్ల కలిగిన ప్రయోజమేమిటి?' అని విన్నవించింది.
ఆమె ఆవేదన చూచి నవ్వి, శ్రీగురుడు యిలా చెప్పారు: 'అమ్మాయీ! నీవు చేసిన అశ్వత్థపూజ వలన నీకెంతో పుణ్యం లభించింది. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి, ఆ పుణ్యం కాస్తా పోగొట్టుకోకు. నా మాటవిని, యిక నుండి యీ సంగమంలో వున్న యీ రావిచెట్టుకు, మాకూ కలిపి నిత్యమూ ప్రదక్షిణ, పూజ చేస్తుండు. మేమెప్పుడూ అశ్వత్థ వృక్షంలో వుంటాము. అందువల్లనే పురాణాలన్నీ దానిని 'అశ్వత్థనారాయణుడని' కీర్తించాయి. గంగాంబ, 'స్వామీ అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థవృక్షం యొక్క ప్రాశస్త్యం వివరించండి. అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగల్గుతాను' అన్నది. శ్రీగురుడిలా చెప్పసాగారు. 'అశ్వత్థవృక్షంలో సర్వదేవతలూ వుంటారు. దాని మాహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్థమే నారాయణ స్వరూపం. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ: దాని మధ్యభాగమే విష్ణువు: దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అలానే, త్రిమూర్తులూ దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలోని కొమ్మలు. తూర్పు దిక్కుకున్న కొమ్మలలో యింద్రాది దేవతలుంటారు. దాని వ్రేళ్ళలో మహర్షులు, గోబ్రాహ్మణులు, నాలుగు వేదాలు వుంటాయి. సప్త సముద్రాలు, పుణ్యనదులు తూర్పుకొమ్మలలో వుంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో 'అ'కారము, మానులో 'ఉ'కారము. దాని పండ్లు 'మ' కారము - ఆ వృక్షమంతా కలసి ప్రణవస్వరూపమే. ఇక ఆ చెట్టుయొక్క మహిమ యెవరు వర్ణించగలరు? అది సాక్షాత్తూ కల్పవృక్షమే.
ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారదమహర్షి యిలా చెప్పాడు: "అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర, ఆషాఢ, పుష్యమాసాలలోనూ, గురు, శుక్రమౌఢ్యాలలోనూ, కృష్ణపక్షంలోనూ ప్రారంభించ గూడదు. శుభ సుముహూర్తంలో స్నానాదులు చేసుకొని శుచియై వుపవశించి మరీ ప్రారంభించాలి. ఆది, సోమ, శుక్రవారాలలోనూ, సంక్రమణ సమయాలు మొ॥న నిషిద్ధసమయాలలోను, రాత్రి భోజనమయ్యాక యీ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్తుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానంచేసి, పుతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థవృక్షానికి భక్తితో ఏడుసార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరలా స్నానంచేసి, దేవతామయమైన ఆ వృక్షానికి పురుషసూక్త విధానంగా షోడశోపచారపూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు గలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని, మౌనంగా గాని, యెంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట, చివరా నమస్కారం చేయాలి. ఇలా రెండు లక్షలు ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలూ నశించి, నాల్గు పురుషార్థాలూ సిద్ధిస్తాయి. త్రికరణశుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి, బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కల్గుతారు. శనివారంనాడు యీ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం తొలగుతుంది. అశ్వత్థాన్ని పూజించాక-
శ్లోకం శ్లో॥ కోణస్ధః పింగళో బభ్రుః కృష్ణారౌద్రాంతకో యమః శౌరిశ్శనైశ్వరో మందః పిప్పలాదేవ సంస్తుతః ॥ అనే మంత్రం ధృఢవిశ్వాసంతో జపిస్తే శనిదోషం గూడ తొలగి, అభీష్టసిద్ధి కల్గుతుంది.
గురువారము, అమావాస్య కలిసిన రోజున రావిచెట్టు నీడన స్నానంచేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేదవిప్రునికి మృష్టాన్నం పెడితే కోటిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది. అక్కడ చేసిన గాయత్రీ మంత్ర జపంవలన నాల్గు వేదాలూ చదివిన ఫలితముంటుంది. రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాలవారికి స్వర్గం లభిస్తుంది. దానిని కొట్టివేయడం మహాపాపం. పైన తెల్పిన రీతిన ప్రదక్షిణలు చేశాక, ఆ సంఖ్యలో పదవ వంతు హోమము, అందులో పదవవంతు బ్రాహ్మణ సమారాధనమూ చేయాలి. ఈ వ్రత కాలంలో బ్రహ్మచర్య మవలంబించాలి. ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును, అలంకరించిన ఆవు-దూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని, ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులూ, కుటుంబీకులూ అయిన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది.
అమ్మా! అశ్వత్థ మాహాత్మ్యం తెలిసింది గనుక యింక దానిని నిందించక, యెట్టి సంశయమూ పెట్టుకోకుండా అలా చేయి. నీ అభీష్టం నెరవేరుతుంది'. అప్పుడు గంగాంబ, 'స్వామీ! అరవై సంవత్సరాలు నిండిన నేను పుట్టుకనుండీ వంధ్యను. నాకు బిడ్డలెలా కలుగుతారు? అయినా నాకేమి? ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా యీ రావిచెట్టును సేవించడమెందుకు?' అనిపిస్తున్నది. ఏమైనప్పటికీ, గురువు మాట కామధేనువని వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక నమ్మి త్రికరణశుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటినుండి మూడు రోజులూ వుపవసించి, మూడుపూటలా షట్కూల తీర్థంలో స్నానంచేసి, గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి, దానికి ఏడు బిందెలు నీళ్ళుపోసి, శ్రీగురుసహితంగా దానిని పూజించింది. ఆ మూడు రాత్రులూ ఆ దంపతులు సంగమంలోనే వున్నారు.
మూడవనాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కన్పించి, 'అమ్మాయీ, నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీగురుని పూజించి, ఆయనిచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను' అన్నాడు. అలాగే నాలుగవరోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి, ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి, రెండు పండ్లు ఆమెకిచ్చి, 'మీ లక్ష్యం నెరవేరింది. పారణ అయ్యాక నీవీ పండ్లు తిను. నీకొక కూతురునూ, కొడుకునూ యిస్తున్నాము. ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రహ్మణులకు దానమివ్వు' అని చెప్పారు. ఆమె అలానే చేసింది. ఆరోజే సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయింది.
నాలుగవ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో గూడ శ్రీగురుని వద్దకు వచ్చి గురుపూజ చేసింది. శ్రీగురుడు. 'నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కల్గుతారు: నీకు ముక్తి లభిస్తుంది' అన్నారు. అయిదవ రోజున భర్తృసమాగమం వలన ఆమె గర్భం ధరించింది. ఆమెభర్త ఎంతో సంతోషించి పుంసవనము, ఎనిమిదవనెలలో సీమంతము మొ॥న సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు. ఆమె 7వ మాసంలో మళ్ళీ శ్రీగురుని దర్శించి ఆశీస్సులు పొందింది. అపుడు శ్రీగురుని ఆజ్ఞమేరకు ఆ పండుముత్తైదువ వాయనదాన మిచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరిసి, పళ్ళన్నీ పట్టు తప్పిన తర్వాత గూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. శ్రీగురుని మహిమ యెంతటిదో అందరికీ అర్థమైంది. ఆమెకు నవమాసాలు నిండాక, ఒక శుభ ముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీగురుని పేరిట 'సరస్వతి' అని పేరు పెట్టుకున్నారు. పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుముకట్టు వేసుకుని, బిడ్డనెత్తుకొని, భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది. బిడ్డను ఆయనముందుంచి, 'వంధ్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది. అది సుఫలమైతే బాటసారులు సేవిస్తారు. వ్యర్థఫలానికంటే వంధ్యాత్వమే మేలు!' అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది. స్వామి వాత్సల్యంతో, 'పుత్రవతీ! లేవవమ్మా!' అని బిడ్డను చూచి, 'ఇది ఆడపిల్లే గాని మగపిల్లవాడు గాడే!' అంటూ ఆమెను చూచి నవ్వి, 'ఇంక సందేహించనక్కరలేదు. నీకు కొడుకుగూడా పుడతాడు' అని చెప్పారు. అప్పుడా పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకుని నిమురుతూ, 'ఈ బిడ్డ దీర్ఘాయువు, సౌభాగ్యము, సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది. ఆమెకు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఈమె సౌశీల్యం గురించి విని యీమె దర్శనానికి దక్షిణదేశం నుండి ఒక రాజు గూడా వస్తాడు. మీకు వేదశాస్త్ర పారంగతుడు, మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు. కాని మీకెలాటి కొడుకు కావాలి?-వంద సం॥లు జీవించే మూర్ఖుడు కావాలా?. లేక 30సం॥ల ఆయుస్సు గల విద్వాంసుడు కావాలా?' అన్నారు. గంగాంబ. 'విద్యావంతుడు, సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి. అతనికి అయిదుగురు పిల్లలు కలిగేలా దీవించండి' అని చెప్పి స్వామికి నమస్కరించింది. స్వామి, 'తథాస్తు' అని ఆమెను దీవించి పంపివేశారు. ఒక సం॥లో ఆమెకు కొడుకు పుట్టాడు. అతనికి గూడ 'నృసింహ' అని శ్రీగురుని పేరే పెట్టారు. వాడు కొంత కాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలను కన్నాడు. గంగమ్మ కూతురు సరస్వతికి గూడ గొప్ప యజ్ఞదీక్షితునితో వివాహమైంది. అతని చేత యజ్ఞాలు చేయించు కోడానికి కాశీ నుండి శ్రీమంతులు, పండితులు వచ్చి, అతనిని తీసుకు వెళ్తుండేవారు.
శ్రీగురుకృప యెంతటిదో చూచావా? నామధారకా! వారి అను గ్రహంతో అసాధ్యమైనది గూడ సాధ్యమౌతుంది. వారిని ధృడ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం".
శ్రీ దత్తాయ గురవే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
సంతాన నష్టం నివారణ (గర్భస్రావాలు, దుష్టశక్తుల నుండి పిల్లల రక్షణ)
20, 21 అధ్యాయాలు · నరసోబావాడి (ఔదుంబర వృక్షం వద్ద)
ప్రీతార్ధిం వార యిత్వాయో బ్రాహ్మణైర్ భక్తి భావితః, దదౌ పుత్రస్య గతిదః శ్రీ దత్త శ్శరణం మమ.
తత్వంయో మృత పుత్రాయై బోధయిత్వా హ్యచేతయత్, మృతం కల్పద్రుమస్థ స్సః శ్రీ దత్త శ్శరణం మమ
అర్థం:
సంతాన నష్టం/మరణ భయం నివారణ: దుష్టశక్తి వల్ల పిల్లలను కోల్పోయిన దంపతులకు రక్షణ కల్పించడం, చనిపోయిన కుమారుడిని తిరిగి బ్రతికించడం.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన
ప్రస్తావన : మీరు చదవబోవు 20, 21 అధ్యాయాలు తెల్పే అంశాలివి : (1) శ్రీ గురుడు ఒకచోట వుంటూ అంతకముందు తామున్నచోట గూడ సూక్ష్మ రూపంలో అచటి భక్తులను రక్షించాడు. మహనీయులు సర్వగతులై భక్తులెక్కడ తమను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర గూడా తెల్పుతుంది. (2) బ్రహ్మజ్ఞాని కొద్దికాలమున్న చోట తీర్థ క్షేత్రమవుతుందని, అక్కడ చేసిన జపము, పూజ ఎన్నో రెట్లు ఫలమిస్తాయనీ శాస్త్రం. (3) శ్రీ గురుడు, అక్కల్కోట స్వామి, సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వ కర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులలో సులభంగా తొలగించి మృతులను గూడ బ్రతికించగలరు. (4) సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు గావు. కాని సద్గురువిచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులందరి చరిత్రలూ నిరూపిస్తాయి. (5) సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులెప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు - నామధారకుడికి శ్రీ గురుని అనుగ్రహం లభించినట్లే. కనుక శ్రద్ధతో ఈ గ్రంధం పఠించేవారి యెదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై వుంటాడని గుర్తుంచు కోవాలి.
కథారంభము
నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, "స్వామీ! శ్రీ గురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత గూడ అమరపురంలోని ఉదుంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు గదా! అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినదా?" అని అడిగాడు. సిద్ధముని సంతోషించి యిలా చెప్పసాగారు : "నాయనా, అటువంటి నిదర్శనాలు ఎన్నో వున్నాయి. అవన్నీ చెప్పడం ఎవ్వరితరమూగాదు. అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను. 'శిరోల' అనే గ్రామంలో వేదశాస్త్రపరాయణుడు, ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారుగాని, ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె యెందరో దేవతలను పూజించింది. ఎన్నో వ్రతాలు, ఉపవాసాలు చేసింది. అయినా ఆమెకర్మ తీరలేదు. చివరకామె తన శోకానికి కారణము, నివారణోపాయము తెల్పమని ఒక దైవజ్ఞుని కోరింది. అతడు, 'అమ్మా! నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే. గర్భపాతం చేసినా, యితరుల ధనం అపహరించినా, తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణునివద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని, అతడెంత బ్రతిమాలినా తిరిగి యివ్వలేదు. అతడా దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై యీ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవీకర్మ అనుభవించక తీరదు' అని చెప్పాడు. అమె పశ్చాత్తా పంతో అతని పాదాల పైబడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, 'అమ్మా! ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందు వలన అతనికి శ్రాద్ధకర్మలు యెవరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడమూ -ఇవన్నీ నీవలననే జరిగాయి. గనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు ఒక నెలరోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి. నిత్యమూ ఏడుసార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము, పూజచేసి, శ్రీగురుని పాదుకలకు పూజ, అభిషేకమూ చేస్తూ, ఉపవాసము చేయి. అటు తర్వాత నీవతనికి అంత్యక్రియలు చేసి, అతని సగోత్రీకుడైన ఒక బ్రాహ్మణునికి నీవపహరించిన వందరూపాయలు దానమివ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలిగి, శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్దాయం గల కొడుకులు కలుగుతారు' అని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతమాచ రించనారంభించింది...
త్రిమూర్తి స్వరూపము, భక్తవత్సలుడూ అయిన శ్రీ గురుడే!
అధ్యాయం 21
కథాకథనం
సిద్ధమునీంద్రుడు యింకా యిలా చెప్పసాగారు: "పుత్రశోకంతో ఖిన్నురాలై నదీతీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి, ఆ బ్రహ్మచారి యిలా అన్నాడు: 'అమ్మా! నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన-మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగ పుట్టి నశిస్తుండడం సహజమే. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరమేర్పడి, కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది. మాయకు వశులైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది, బిడ్డ - భార్య - మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు. వారు సత్వ గుణము వలన దేవత్వాన్ని, రజోగుణము వలన మానవత్వాన్నీ, తమోగుణం వలన అధోగతిని పొంది, కర్మఫలమనుభవిస్తారు. ఈ సృష్టిలో యిది యెవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని, మరణం వలన దుఃఖం గాని పొందరు. వారి వారి కర్మలననుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికీ శరీరం రక్తము, మాంసము మొ॥న ధాతువులతో నిండి మలినమైనది. బుద్ధిమంతులు యిట్టి శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరు. ఎన్నెన్ని జన్మలలో యెవరెవరికి తల్లులో, బిడ్డలో, భర్తలో యెవరికెరుక? ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి, శాస్త్ర విధిననుసరించి అంత్యక్రియలకై వారికీ శవాన్ని అప్పగించు'. ఆ మాటలు విని శాంతాదేవి, 'అయ్యా, మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే గాని, అది నా మనస్సులో కొంచెం గూడ నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే, భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలెలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు. ఇపుడు మరి నన్నెందుకిలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు; పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు. అలానే శ్రీగురుని సేవించి, ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకొనడమే నా మూర్ఖత్వమా? ఈ నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని ఆయన వరమిచ్చాడు. నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తూ ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందు కవాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని గూడా ఆయనకే సమర్పిస్తాను' అన్నది. అప్పుడా బ్రహ్మచారి, ' అమ్మా! అలా అయితే యిక్కడ దుఃఖించి యేమి ప్రయోజనం? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే యీ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు!' అని ఉపాయం చెప్పాడు. ఆ తల్లి అందుకంగీకరించి, శవాన్ని తన కడుపుకు కట్టుకుని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్ద కెళ్ళింది. అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచటి పాదుకలకు తన తలను కొట్టుకుంటూంటే, రక్తం కారి పాదుకలు తడిశాయి. సాయంత్రమయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, “నీవు దుఃఖం అణచుకుని కర్తవ్యమాలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తిచేయాలి. శవం యింక వాసనగూడ వస్తుంది. కనుక దానిని మాకప్పగించు. అంతేగాక, ఈ స్థలం ఊరికెంతో దూరం. ఏకాంతము, భయంకరము అయిన యీ ప్రదేశంలో మీరిక వుండవద్దు" అని తొందరపెట్టారు. కాని ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని, పాదుకలకు తన తల కొట్టుకుంటూనే వున్నది. ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక, 'ఇక చీకటిపడుతున్నది. ఇక్కడ దొంగల భయమున్నది. మనమిండ్లకు వెళ్ళి, రాత్రి ఉపవాసముండి, తెల్లవారాక శవసంస్కారం చేద్దాం. ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది' అనుకుని యిళ్ళకు వెళ్ళిపోయారు. గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీ గురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే వుండిపోయారు. పిల్లవాడు చనిపోక ముందు మూడురోజులు, తర్వాత రెండురోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి యేడ్చి సోలిపోయిన ఆమెకు, నాటి తెల్లవారుఝామున కునుకు పట్టింది. అప్పుడామెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. ఆయన జడలు, విభూతి, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించివున్నారు. ఒక చేతిలో దండము, మరో చేతిలో త్రిశూలము ధరించి వున్నారు. ఆయన బయటనుండి వీరున్న ఉదుంబర వృక్షం క్రిందకు వచ్చి, ఆమెతో, 'అమ్మా! నాపై నిష్ఠూరాలాడతావెందుకు? నీ బిడ్డకేమయింది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను' అని ఆ శవానికి విభూతి పూస్, పిల్లవాని ముక్కులోకి గాలివూది, 'అమ్మా! నేను నీకేమపకారం చేసాను? ఇంకా ఉపకారమే చేసాను. నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాయవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను. నా మీద కష్టపెట్టుకోవద్దు. ఇక దుఃఖించకు' అని చెప్పి అదృశ్యులయ్యారు. శాంతాదేవి తృళ్ళిపడి నిద్రలేచింది గాని, 'ఇది నా పుత్రవ్యామోహం వలన వచ్చిన కలే గాని, చనిపోయినవాడింక బ్రతుకుతాడా? నా ప్రారబ్దమిలా వుంటే శ్రీగురుడేమి చేస్తాడు? అనుకున్నది. ఇంతలో ప్రక్కనున్న శవం కదలసాగింది. ఆమె త్రాకి చూస్తే వెచ్చగా వున్నది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతమావేశించిందేమోననిపించి, భయమేసి దూరంగా వెళ్ళింది. కాని పిల్లవాడు లేచి కూర్చుని, 'అమ్మా! ఆకలేస్తున్నది. అన్నం పెట్టు!' అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యమొచ్చింది. ఆమె బిడ్డకు పాలిచ్చి, భర్తను నిద్రలేపి, జరిగినదంతా వివరించింది. అప్పుడాదంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారము చేసి శ్రీ గురునిలా స్తుతించారు. ఓ శ్రీ గురుమూర్తీ! జయము జయము. సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవరూపం ధరించారు. వారి హితం కోరి, నిరంతరమూ వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను హరించే మీ మహాత్మ్యాన్ని వర్ణించడం ఎవరితరమూ గాదు. తల్లివలె మీరు మా తప్పులు క్షమించి కృప చూప మిమ్ములను శరణ వేడుతున్నాము. తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి, ఆ నీటితో గురు పాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని, పాదుకలనూ అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయమయింది. శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు, ఆ బాలుడు బ్రతికి వుండడం చూచి అశ్చర్యపడి శ్రీ గురు మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడూ అయ్యాడు. కనుక నామధారకా! ఈ క్షేత్రమహిమను వర్ణించడం ఎవరితరమూ గాదు. అచ్చటి మేడిచెట్టు మూలంలో శ్రీ గురుడు నిశ్చయంగా నిత్యనివాసం చేస్తున్నాడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి. సందేహం లేదు. అందుకే అచ్చటి మేడిచెట్టు సాక్షాత్తూ కల్పవృక్షమే !".
శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యైనమః.
వాస్తు దోష నివారణ (ఇల్లు కొన్న తర్వాత వచ్చే సమస్యలు, బ్రహ్మరాక్షసుల బాధలు)
23వ అధ్యాయం · సంఘటన జరిగిన మఠం దగ్గర
రాజ ప్రార్ధిత యేత్యాస్థాత్, మరే యో గంధర్వపురే బ్రహ్మరక్ష స్సముధ్ధర్తా, శ్రీ దత్త శ్శరణం మమ
అర్థం:
వాస్తు/భూత ప్రేత దోష నివారణ: రాజు కోరిక మేరకు గంధర్వపురంలో బ్రహ్మరాక్షసుడికి ముక్తిని ప్రసాదించడం. వాస్తు దోషాలు, దుష్ట శక్తులు మరియు భయం నుండి రక్షణ కోసం.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః.
కథాకథనం సిద్ధముని యింకా యిలా చెప్పారు: "నామధారకా! శ్రీ గురుడు గొడ్డు బజ్జె నుండి పాలుపితికించడంతో అంతవరకూ గుప్తంగా వున్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మర్నాడు కొందరు గ్రామస్థులు మట్టి తోలుకోడానికి బజ్జెను బాడుగకు యిమ్మని అడగటానికి వచ్చారు. అప్పుడా బ్రాహ్మణుడు, 'అయ్యా! మా గేదె పాలిస్తున్నది. కనుక యికనుండి దానిని మట్టి తోలడానికి పంపలేము' అని చెప్పి, నాడు ఆ గేదె యిచ్చిన పాలు చూపించాడు. ఆ గ్రామస్థులు, 'అరెరే! యింతవరకూ ఒక్కసారైనా కట్టని యీ ముసలిబజ్జె పాలు ఎలా యిచ్చింది?' అని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది. అతడాశ్చర్యపడి, కుతూహలంతో బ్రాహ్మణుని యింటికి వచ్చి చూచి, అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకొన్నాడు. వెంటనే అతడు సకుటుంబంగా, పరివారంతో గూడ సంగమానికి వెళ్ళి శ్రీగురునికి పొర్లుదండాలు పెట్టి, సాష్టాంగ నమస్కారం చేసి యిలా స్తుతించాడు : 'జగద్గురూ! మీకు జయము. మాయామోహితుడైన నాకు త్రిమూర్తిస్వరూపులైన మీ అపారమహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూపా! నన్ను మీరే యీ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవునిలాగా కన్పించే మీరు విశ్వకర్తలు శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, 'రాజా! మేము తపస్వులము. అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి?' అన్నారు. రాజు సవినయంగా నమస్కరించి, 'ప్రభూ! మీరు భక్తులనుద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము. అట్టి మీరు యీ అడవిలో నివసించడమెందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి, మీరు అనుష్ఠానం చేసుకోడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడ వుండి మమ్మల్ని ఉద్దరించండి. మా పట్టణాన్ని పావనం చేయండి' అని స్వామి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు స్వామి, 'ఇది భగవదేచ్ఛ. మేము ప్రకటమయ్యే సమయమాసన్నమైనది. కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును, భక్తులనూ రక్షించాలి' అనుకొని అనుమతించారు. రాజెంతో సంతోషించి, శ్రీగురుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టి వాద్య, నృత్య, గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్లాడు. పల్లకీకి ముందు ఏనుగులు, గుఱ్ఱాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వందిమాగధులు నడచివచ్చారు. రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు. విప్రులు వేద మంత్రాలు చదువుతుంటే, వంది మాగధులు శ్రీగురుని స్తుతిస్తున్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురుేగి జయజయధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు. ఊరేగింపు పడమటి దిక్కునుండి గంధర్వనగరంలో ప్రవేశిస్తున్నది. అక్కడొక పెద్ద రావిచెట్టు వున్నది. దాని సమీపంలోని యిళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా వున్నాయి. అందుకు కారణం, ఆ చెట్టుమీద ఒక బ్రహ్మరాక్షసుడుండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకొచ్చిన మానవులను, జంతువులను మ్రింగివేస్తుండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ యిండ్లు విడిచిపోయి, ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే, స్వామి తమ పల్లకీ నుండే ఆ చెట్టుపైకి చూచారు. మిగిలిన ఎవ్వరికీ కనిపించక పోయినా, ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టుదిగి వచ్చి స్వామికి నమస్కరించి తననుద్ధ రించమని ప్రార్థించాడు. పరాత్పరుడు, కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు. తక్షణమే అతనికి మానవాకారమొచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, "నాయనా! నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి. నీ పాపం నశించి ముక్తి పొందుతావు' అని ఆదేశించారు. అతడు స్వామికి నమస్కరించి, వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచి పెట్టి ముక్తిపొందాడు. ఈ సన్నివేశం చూచిన పట్టణవాసులు, శ్రీగురుడు సాక్షాత్తూ పరమేశ్వరుడని తెలుసుకున్నారు. అపుడు శ్రీగురుడు. 'నాకు మఠమిక్కడే నిర్మించాలి' అన్నారు. అప్పటికప్పుడే ఆ సమీపంలోవున్న ఒక పాడుబెట్టిన యిల్లు శుభ్రం చేసారు. దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు. స్వామి అందులో వుంటూ రోజూ స్నానానికి, అనుష్ఠానానికీ, సంగమానికి వెళ్ళి వచ్చేవారు. నిత్యమూ రాజు ఆయనను దర్శించి పూజించేవాడు. శ్రీ గురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడూ ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాజ మర్యాదలతో తీసుకువెళ్ళేవాడు. నిత్యమూ ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తూండేవారు. ఆ పట్టణంలో ప్రతినిత్యమూ బ్రాహ్మణ సంతర్పణలు జరుగు తూండేవి. అలా శ్రీగురుని కీర్తి గ్రామగ్రామాలకూ ప్రాకిపోయింది. గంధర్వనగరానికి కొద్దిదూరంలోని 'కుమసి' అనే గ్రామంలో త్రివిక్రమ భారతియనే సన్యాసి వుండేవాడు. వేదవిదుడైన ఆ యతి, నిత్యమూ నృసింహావ తారాన్ని మానస పూజతో ఉపాసిస్తుండేవాడు. ఇతడు శ్రీగురుని గురించి విని, 'ఆ యతి దాంభికుడు; సన్యాసాశ్రమధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తు న్నాడు' అని ఆక్షేపిస్తూండేవాడు. విశ్వవ్యాపి, సర్వసాక్షియైన శ్రీగురుడు ఆ సన్యాసి: చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు. అప్పుడొక అద్భుతం జరిగింది."
శ్రీ దత్తాయ గురవే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః