ఓంభక్తి ఆరాధన

సప్త శనివార వ్రత కథ - శ్రీ వేంకటేశ్వర సప్త శనివారం - కుమ్మరి భీము కథ

తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున నొక పల్లెలో భీముడు అను కుమ్మరి వాడొకడు కలడు. అతడు పేదవాడు. కుండలను తయారుచేసి వానిని అమ్ముకొని జీవించెడివాడు. వానికి శ్రీ శ్రీనివాసుని పై భక్తి యెక్కువ. చిరకాలము దేవుని పూజింపవలయును అని యున్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశముండెడిదికాదు. అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిమనుంచుకొనెను. సారెపై కుండలను తయారుచేయునప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగ చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచు చుండెడివాడు, అది వానికి నిత్య కృత్యమయ్యెను.

ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడ శ్రీ వేంకటేశ్వరస్వామియందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినమును వేంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించెడివాడు. కొంత కాలమునకు అతడిలో అహంకారము పొడసూపెను. ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా, తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టిపూలు స్వామివారి వద్ద కనిపించినవి. కారణము అర్థము కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలనుంచుచున్నారని యనుమానించెను. తన భటులను కాపలాగా నుంచెను. రాజు యెన్ని విధములుగా యత్నించినను బంగారుపూల స్థానమున మట్టిపూవులే స్వామివారి యొద్ద నుండెడివి. మహారాజునకు మానసిక వ్యథ పెరిగెను. చింతాపీడితుడైన వానికి శ్రీ వేంకటేశ్వరస్వామి కలలో కనిపించెను. ‘రాజా! సమీప గ్రామమున భీముడను కుమ్మరియొకడు కలడు. అతడు కుండలు చేయుచున్నను నా స్మరణమును ధ్యానమును విడువని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పూవులు యిచటి నా సన్నిధానమును చేరుచున్నవి. నీవుంచినట్టి బంగారు పూలు అతడుంచిన పూలముందు నిలువలేక అదృశ్యములగుచున్నవి. భక్తిలో అతడు నీకంటె ఉత్తముడు. విచారింపకుము’ అని ఊరడించెను.

తనను మించిన భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పినమాటలు పరిశీలించుటకై వేంకటాచలమునకు సమీపముననున్న పల్లెలలో భటులతో గలసి తిరుగసాగెను. ఒక పల్లెలో సారెపై కుండనుంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగ చేసి సమీపమున నున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమకు సమర్పించుచున్న భీముని చూచి ఆశ్చర్యపడెను.

రాజు భీముని సమీపించి ‘ఓయీ! నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట యేల? నీకు పూజకు పుష్పములు దొరకుటలేదా?’ అని యడిగెను. భీముడు రాజునకు నమస్కరించి ‘మీవంటివారు వచ్చుటచే నా యిల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని పూజించుట యెట్లో తెలియనివాడు. దరిద్రుడను. కుండలను చేయనిదే నా కుటుంబమునకు గడువదు. కావున నేనుదయమునుండి సాయంకాలము వరకు కుండలను చేయక తప్పదు. చేతికి అంటిన మట్టినే పుష్పముగ చేసి యిట్లు స్వామివారికి సమర్పించుకొనుచుంటిని’ అని వివరించెను. కుమ్మరివాని మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరివాని భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ తరువాత కొంతకాలమునకు భీముడు సశరీరముగా వైకుంఠము చేరెను. శ్రీ వేంకటేశ్వరస్వామి భీముని భక్తికి మెచ్చి ‘యికనుండి నా ఉదయం ప్రసాదము మట్టిపాత్రలో నివేదింపవలయునని’ తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పెను. ఈనాటికిని స్వామివారి సన్నిధిలో యీ ఆచారమును పాటించుచు ‘ఓడు’ అనే ప్రసాదమును మట్టికుండలతోనే నివేదన చేయుచు ఆరాధించుచున్నారు.

తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వేంకటేశ్వరస్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు సమారాధనలు మున్నగువానిని జరిపించుచు మరుజన్మలో విష్ణులోకమును చేరెను.

‹ ముందు అధ్యాయంతర్వాతి అధ్యాయం ›

భక్తి ఆరాధన యాప్ తెరవండి →