ఓంభక్తి ఆరాధన

సప్త శనివార వ్రత కథ - శ్రీ వేంకటేశ్వర సప్త శనివారం - శ్రీ వేంకటేశ్వర అవతార ఘట్టం

శౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వేంకటేశ అవతార కథ:

కలియుగం మొదలైనది. కలిదోష నివారణం కోసం మహర్షులందరూ నైమిశారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవ్వరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి ‘యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తా’ నన్నాడు. ఆయన మహాతపశ్శాలి. మునులంతా ఆమోదించారు.

ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక, సరస్వతీ వీణా నాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగుమహర్షికి కోపం వచ్చి ‘మహా తపశ్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టి కర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలోఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవును గాక’ అని శపించాడు.

తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగుమహర్షి కోపంతో ‘శంకరా! నీవు నాట్య విలాసాలలో మునిగి, మహాతపశ్శాలిని, అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక, భూలోకంలో నీకు లింగరూపంలోనే కాని నిజరూపంలో ఆరాధన జరగకుండును గాక’ అని శపించినాడు.

ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపుమీద పరుండి, తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నాడు. మునిరాకను గమనించలేదు. భృగువు వెళ్ళి, ‘అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా?’ అంటూ విష్ణుమూర్తి గుండెలమీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీమహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి ‘మునీంద్రా! మీ రాకచేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి’ అంటూ భృగుమహర్షికి పాదాలొత్తాడు. భృగుమహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి ‘ఓ దేవదేవా! మీవంటి సత్త్వగుణ సంపన్నులు పదునాలుగు లోకాలలోను లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశింపచేసి ధర్మసంరక్షణచేసి, ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి.’ అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ‘త్రిమూర్తులలోను పరమ శాంతమూర్తి శ్రీమన్నారాయణుడే. అతడే యజ్ఞఫలానికి అర్హుడు’ అని తేల్చి చెప్పినాడు. మునులందరూ సత్ర యాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే ధారపోసినారు.

అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది. లక్ష్మి లేని యిల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి ‘దేవా! కలియుగంలో అధర్మం పెరిగింది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు.’ అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మికోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు.

శేషాద్రి పర్వతప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చెయ్యబోతూ భూమిని దున్నుతూండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరుపెట్టుకొని అల్లారుముద్దుగా పెంచాడు. యుక్తవయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి, శ్రీనివాసుని చూసి మోహించింది. తలిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజోవిశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు.

ఆకాశరాజు తరువాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వేంకటేశ్వరుడను నామంతో తిరుమల శిఖరాలమీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతీ భూదేవులతో నివసించసాగినాడు. తొండమానుడు శ్రీ వేంకటేశునికి ఆలయం నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షంలాంటివాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలచిఉన్నాడు.

శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని, ‘వేంకటాచలం పై వెలిశాకా శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవ్వరైనా ఉంటే, వారి కథను వినిపించు’ మని సూతుని అడిగారు. సూతుడు ఇలా చెప్పాడు.

తర్వాతి అధ్యాయం ›

భక్తి ఆరాధన యాప్ తెరవండి →