ఓంభక్తి ఆరాధన

లక్ష్మీ కుబేర వ్రత కథ - అక్షయ తృతీయ లక్ష్మీ కుబేర పూజ - ఇద్దరు స్నేహితుల వృత్తాంతం

పూర్వం ఉజ్జయినీ పట్టణంలో దేవదత్తుడూ దేవదూరుడూ అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. పేరుకి తగ్గట్టే మొదటివానికి దైవం పైన అచంచల విశ్వాసం. రెండవ వాడు నాస్తికుడు, తన జీవితమంతా తన సామర్థ్యం పైనే నడుస్తోందనే అహంకారం మెండు. ఇద్దరూ దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు.

ఒకసారి వ్యాపారనిమిత్తం అన్ని ఊళ్ళూ తిరిగారు. సరైన లాభం దొరకక, అలసిపోయి ఒక గ్రామంలో ఆలయం అరుగుపైన పడుకొన్నారు. ఆ పక్కరోజు ఉదయాన్నే ఆదిదంపతుల్లా ఉన్న ఒక జంట వచ్చి, ‘మీరు పడుకున్న ఆలయం సామాన్యమైనది కాదు, మహిమాన్విత ప్రదేశం. మీ దరిద్ర బాధను తొలగించే ఉపాయం మీకు చెప్పమని దైవాజ్ఞ అయ్యింది, చెప్తా వినండి’ అంటూ లక్ష్మీ కుబేర వ్రత విధానాన్ని ఉపదేశించారు.

ఇద్దరూ గ్రామానికి వచ్చాకా, దేవదత్తుడు ఆ వ్రతం ప్రారంభించాడు. ఏ కళన ఉన్నాడో కానీ దేవదూరునికి కూడ ఆ వ్రతం చేయాలనిపించి చేశాడు. ఇద్దరు దానధర్మాలు చేసి జనులకి భోజనాలు పెట్టారు. అచిరకాలంలోనే గొప్ప ధనవంతులు అయ్యారు. అష్టైశ్వర్యాలనీ సంపాదించుకున్నారు. దేవదూరుడు ఒకనాడు మనస్సులో, ‘ఈ వ్రతం నన్ను నిలబెట్టడం ఏమిటి, నేను నా తెలివి తేటలతో ఎదిగాను’ అని అహంకరించి ఆ వ్రతం మానివేశాడు. తొందరలోనే అతని సంపదలన్నీ విచిత్ర పరిస్థితుల్లో చేయి జారిపోయాయి. బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆ వ్రతాన్ని ప్రారంభించాకా మళ్ళీ సంపద నిలచింది. అది మొదలు జీవిత కాలం వ్రతం ఆచరించాడు.

మానవుడు తన సంపాదనంతా తన తెలివితేటలతోనే వచ్చిందని అహంకరించక, పైనున్న ఒక శక్తి తనని నడుపుతోందనే స్పృహతో, దాన ధర్మాలు చేస్తూ ఒద్దికయైన జీవితం గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది. అదే ఈ వ్రతం అంతర్లీనంగా చెప్పే సందేశం.

‹ ముందు అధ్యాయంతర్వాతి అధ్యాయం ›

భక్తి ఆరాధన యాప్ తెరవండి →