ఓంభక్తి ఆరాధన

లక్ష్మీ కుబేర వ్రత కథ - అక్షయ తృతీయ లక్ష్మీ కుబేర పూజ - వ్రత మహిమ, విధానం

పూర్వం మహర్షులంతా సూతులవారి వద్దకు చేరి ‘ఓ మహాత్మా! భూమిపై మనుష్యులందరూ ధన సముపార్జన కోసం అష్టకష్టాలూపడుతూ ఉంటారు. చాలామందికి ప్రారబ్ధకర్మవల్ల, ఎంత కష్టపడినా ధనం, ధాన్యం, భుక్తీ లభించక, జీవితంలో అభివృద్ధి లేక, సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతూ ఉంటారు. అటువంటివారు ఆ కర్మను తుడిచేసుకొని సంపదలని పొందే మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని’ ప్రార్థించారు.

అపుడు సూతమహర్షి ‘ఓ మునులారా, ఈ ప్రశ్నలో మీ స్వార్థం లేదు. లోక కల్యాణం కోసం అడిగారు కనుక మీకు ఒక అద్భుతమైన వ్రతం గురించి చెప్తాను. దానిని శ్రీలక్ష్మీ కుబేర వ్రతం అంటారు. కుబేరుడు ధనాధిపతి. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కునకూ, నవ నిధులకూ పాలకుడయ్యాడు. అతని భార్య చిత్రరేఖ. మహాలక్ష్మీ దేవి సహితంగా, కుబేరుననీ చిత్రరేఖా దేవినీ ఆరాధించినవారు ధన సంబంధమైన కష్టాలు తీరి ధనవంతులై సుఖపడతారు.

ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడైనా, అక్షయ తృతీయ నాడైనా, శ్రావణ మాసంలోనైనా, ఏడాదిలో ఏ గురువారమైనా శుక్రవారమైనా పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు. పర్వదినాల్లో చేస్తే విశేష ఫలితం. ఒక్కరోజు పూజలా చేసుకోవచ్చు, లేక ఏదైనా సంకల్పంతో చేసేవాళ్ళు అభీష్ట సిద్ధి కోసం వ్రతంలా నవనిధి పరిపాలకుణ్ణి 9 వారాలు భక్తితో అర్చించాలి. పదవ వారము ఉద్యాపన చేయవలెను. అన్ని వారాలు చేయలేని అశక్తులు అయిదు వారములు పూజ చేసి ఆరవ వారము ఉద్యాపనము చేసుకొనవచ్చును.

వ్రతమాచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, బియ్యంతో మండపం ఏర్పాటు చేసి, గణపతినీ దిక్పాలకులనీ నవగ్రహాలనీ లోకపాలకులనీ ఆరాధించి, లక్ష్మీ దేవికీ, కుబేరునికీ షోడశోపచారాలతో పూజ చేసి, అష్టోత్తర శతనామాదులతో అర్చించి, ధూపదీప నైవేద్యాలనీ సమర్పించాలి. ఆ తరువాత ఈ వ్రత కథలు చదువుకొని పూజాక్షతలని శిరస్సున ధరించాలి. అతిథిని పిల్చి లక్ష్మీ కుబేర స్వరూపంగా భావించి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. భోజనం పెట్టలేనివారు ప్రసాదం పెట్టి తాంబూలం ఇవ్వాలి. భక్తి శ్రద్ధలతో ఇలాచేస్తే సమస్త దరిద్రాలూ తొలగిపోయి అష్టైశ్వర్యాలూ లభిస్తాయి’

అని చెప్పి, ఆ వ్రతం చేసి ఫలితాన్ని పొందిన ఇద్దరు స్నేహితుల వృత్తాంతాన్నీ, కుబేరుని పూర్వజన్మ వృత్తాంతాన్నీ, సూత మహాముని ఇలా వివరించాడు.

తర్వాతి అధ్యాయం ›

భక్తి ఆరాధన యాప్ తెరవండి →