ఓంభక్తి ఆరాధన

లక్ష్మీ కుబేర వ్రత కథ - అక్షయ తృతీయ లక్ష్మీ కుబేర పూజ - కుబేరుని పూర్వ జన్మ వృత్తాంతం

పూర్వం ధనదత్తుడనే ఒక లోభి ఉండేవాడు. అతడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు. గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించాడు. 3 కుమారులు, 3 కుమార్తెలు ఉండేవారు. అపార ధనవంతుడైనా ఏనాడూ దాన ధర్మాలు చేయక కూడబెట్టేవాడు. పైసా ఖర్చు పెట్టాలంటే ముందూ వెనుకా చాలా ఆలోచించేవాడు. ఏనాడూ ఏ దేవాలయంలోనూ ఒక్క పైసా వేయలేదు. యాచకుడికి దానము అసలే ఇవ్వలేదు. ఎంతసేపూ తనూ తన కుటుంబం, తనూ తన వాళ్ళ సుఖం, అదే ప్రపంచం.

ఒక నాడు ఒక సాధువు అతడి ఇంటికి వచ్చి, ‘నాయనా, నీతో అవసరంగా మాట్లాడాలి’ అన్నాడు. ఆయన అప్పు ఎక్కడ అడుగుతాడో అని భయపడి ‘ఇప్పుడు ఖాళీ లేదు మళ్ళీ రండి’ అన్నాడు. ఆ సాధువు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అదే తంతు. అలా 12 సార్లు తిప్పించుకున్నాకా, ఆఖరికి ‘ఎందుకు నన్ను విసిగిస్తారు, నేను అప్పు ఈయలేను’ అన్నాడు. అప్పుడాయన, ‘నాయనా, నేను నీ ధనం కోసం రాలేదు, నీకు త్వరలో అపమృత్యు యోగం ఉంది, చెప్పి పోదామని వచ్చాను’ అన్నాడు.
ధనదత్తుడు బెంబేలెత్తిపోయి ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి, ‘దాన్ని ఎలా తప్పించుకోవాలి శెలవీయండి’ అని వేడుకున్నాడు.
అప్పుడు ఆ సాధువు, ‘నీ భార్యా పిల్లలలో ఎవరైనా ఈ గండాన్ని స్వీకరిస్తే నీకు పూర్ణాయుష్షు కలుగుతుందని’ సెలవిచ్చాడు.

ధనదత్తుడు తన భార్యాపిల్లలని వేడుకున్నాడు, వాళ్ళు పగలబడీ నవ్వి, ‘నీ గండం మేమెందుకు స్వీకరిస్తాం, మా ఆయుష్షు మాకు కావాలి, నీ పాపాన్ని నువ్వే అనుభవించు’ అన్నారు.
‘ఇన్నాళ్ళూ మిమ్మల్ని సుఖాలలో ముంచెత్తాను, మీకోసమే సంపాదించాను. నాకోసం ఈ మాత్రం చేయలేరా?’ అని ధనదత్తుడు అడిగితే, ‘అది యజమానిగా నీ బాధ్యత, నువ్వు నిర్వర్తించావు, దానికీ దీనికీ సంబంధం లేదు’ అని కరాఖండిగా చెప్పేశారు. అతడెంత బ్రతిమాలినా వినలేదు.

అతడిలో తీవ్రవైరాగ్యం ఉదయించింది. సాధువు పాదాలని ఆశ్రయించి శివార్చన ప్రారంభించాడు. యాచించినవారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ, రాత్రింబవళ్ళు ఈశ్వరార్చన చేసి ఆఖర్లో కైలాసానికి చేరాడు. అక్కడ పరమేశ్వరుణ్ణి అకుంఠిత దీక్షతో సేవిస్తే, ఆయన అనుగ్రహించి ఉత్తర దిక్కుకీ, నవనిధులకీ ఆధిపత్యాన్ని ప్రసాదించారు.

ఈ జన్మలో భగవంతుణ్ణి ఆశ్రయించి, లేనివారికి దానం చేస్తే అది ఎంతటి ఉత్తమ గతినైనా కలిగిస్తుందని చెప్పడానికి ఈ కథే నిదర్శనం.

తత్సత్ ఏతత్ సర్వం శ్రీ లక్ష్మీ నారాయణార్పణమస్తు

‹ ముందు అధ్యాయం

భక్తి ఆరాధన యాప్ తెరవండి →