గణపతి వ్రత కథ - సంకష్ట హర చతుర్ధి - వేశ్య వృత్తాంతం
ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు. ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు, ‘ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది’ అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా!
అపుడు ఇంద్రుడు ‘ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున సాయంత్రం వరకూ ఎవరైతే ఉపవాసం చేసి సంకష్ట హర గణేశ వ్రతం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది’ అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా అన్వేషిస్తూ, ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం, వ్రతం చేసిన వారు కనబడకపోదురా? అని తిరిగారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.
అదే సమయంలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత గణపతికి నమస్కరించింది. ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి (స్వానంద లోకానికి) చేరుకోటం మరణానంతరం తథ్యం’ అని చెప్పాడు.
అపుడు సైనికులు, ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తమకిమ్మని గణేశుని దూతని ఎంతో బ్రతిమాలారు. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఈ లోపు ఆమె దేహం మీంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది.
తెలియక చేసినా ఆ వ్రతం ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పే వృత్తాంతం ఇది.