ఓంభక్తి ఆరాధన

గణపతి వ్రత కథ - సంకష్ట హర చతుర్ధి - భృశుండి మహర్షి వృత్తాంతం

ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి, కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా? అని చూసాడు. అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరక యాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి,

‘ఓ మహర్షీ! నీ పూర్వాశ్రమంలో భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకములో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చేయి’ అని చెప్పి వెళ్ళిపోయాడు.

నారదుడి మాటలు విన్న భృశుండికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. వారి సహకారం వల్లే తాను ఈ నాడు తపస్వినయ్యాను, ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు. తన ఇష్ట దైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తనవారికి ధారపోయాలని అనుకొని, ‘ఓ గణనాథా! నేనే గనుక నీ దివ్యచతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే, నా పితరులు, వారితోపాటు నా భార్య, కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందుదురు గాక!’ అని నీళ్ళు విడిచి పెట్టాడు. గజాననుడి అనుగ్రహముతో ఆయన చేసిన వ్రతాలలో, ఒక్క పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే, ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాల్ని ధరించి, దివ్యవిమానం ఎక్కి గణేశ లోకానికి చేరుకున్నారు.

ఇక ప్రతీ మాసం ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్ప తరమా?

‹ ముందు అధ్యాయంతర్వాతి అధ్యాయం ›

భక్తి ఆరాధన యాప్ తెరవండి →