ఓంభక్తి ఆరాధన

గణపతి వ్రత కథ - సంకష్ట హర చతుర్ధి - కృతవీర్యుని కథ

పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహా పతివ్రత, సుగుణవతి, ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్యదంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్రసంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా, ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తను మంత్రులకి రాజ్య భారాన్ని అప్పగించి భార్యతో కల్సి అరణ్యాలకి వెళ్ళిపోయాడు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి, కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది.

ఒకనాడు ఆకాశమార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలి పడి, పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుడి తండ్రిని కలిసాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధ పడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి ‘ప్రభూ! నా కుమారుడు సకల సద్గుణ వంతుడు, దానశీలి, ధర్మప్రభువు. ఎన్నో యజ్ఞాల్ని, వ్రతాల్ని చేసినవాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్రసంతానము కలగకపోవడానికి కారణము ఏమిటి? అతడు ఏ పాపం చేసాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతానప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి’ అని దీనంగా ప్రార్థించాడు.

అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రితో ఇలా చెప్పాడు. ‘నీ కుమారుడు పూర్వ జన్మలో సాముడు అనే పేరుగలవాడు. పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతను ధనకాంక్షతో దారి కాసి, బ్రహ్మవేత్తలూ సాత్వికులూ అయిన పన్నెండుమంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గరున్న సంపదనీ ఆహారాన్నీ దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆరోజు మాఘ బహుళచతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు, తన కుమారుణ్ణి ’గణేశా‘ అని పేరు పెట్టి పిలిచాడు. దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కల్సి తిన్నాడు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. పరమపాపి అయినప్పటికీ మాఘ బహుళ చవితినాడు ఏమీ తినక పోవటం, సంధ్యాసమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశా అని పలుమార్లు పిలవటం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. కొంతకాలము గడిచాక భూలోకంలో కృతవీర్యుడనే పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు. ప్రస్తుతం అతడెన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గతజన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది’ అని చెప్పాడు.

ఆ మాటలు విన్న కృతవీర్యుడి తండ్రి ఎంతో బాధపడుతూ ‘పితామహా! నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి. అది ఎంత కష్టమైనదైనా సరే!’ అని ప్రాధేయపడ్డాడు.

అప్పుడు బ్రహ్మ, ‘నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనదీ, కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీగణేశ ’సంకష్ట హర చతుర్థి‘ వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి’ అని వ్రత విధానం చెప్పాడు.
అప్పుడు కృతవీర్యుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీర్యుడు సంతానవంతుడయ్యాడు. కరడుకట్టిన ప్రారబ్ధాన్ని సైతం, కర్పూరంలా కరిగించివేసే మహిమాన్వితమైన వ్రతం ఇది.

ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియచేస్తున్నాయి. వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని, వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారనీ, నరదృష్టి పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ పతనమవ్వరనీ దీని భావం. ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేశుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు.

శ్రీ గణేశాయ నమః – స్వస్తి

‹ ముందు అధ్యాయం

భక్తి ఆరాధన యాప్ తెరవండి →