ఓంభక్తి ఆరాధన

గణపతి వ్రత కథ - సంకష్ట హర చతుర్ధి - వ్రత మహిమ, విధానం

ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి, ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. ‘స్వామీ కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి, తత్ఫలితముగా ఋణ బాధలు, సంతానలేమి, గృహ వసతి లేకపోవుట, దీర్ఘ వ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, వలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడిపంటలు సరిగ్గా పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట, చేయని తప్పుకి రాజ దండన అనుభవించుట’ మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతరాజమేదైనా సెలవీయండి అని స్కందుని అడిగారు.

అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై ‘వ్రతాలలోకెల్లా అత్యంత శక్తిమంతమైన సంకష్టహరచతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి, శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకూ ఫలితమందక బాధపడుతూ, తన పూర్వపు అవతారాలలో తనయందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందినది.

ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి’ ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా, బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని, ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని, కాలకృత్యాలు తీర్చుకొని, నల్లనువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి, సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి, సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని, ఎరుపు రవికెల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపూ కుంకుమ వేసి, మూడు దోసిళ్ళ బియ్యాన్ని అందులో పోసి, ఎండుఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి. దానిని స్వామి గణపతికి 21 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామ స్మరణ చేస్తుండాలి.

సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి, శ్రీ సంకష్ట హర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి, కుడుములూ చేసి స్వామికి నివేదించాలి. వ్రతమూ అర్ఘ్యాలూ అయిన పిదప అతిథులని గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి. ఆ ముందు రోజూ ఆ రోజూ బ్రహ్మచర్యాన్ని పాటించి, దైవ నామ స్మరణతో, లౌకిక విషయాలమీదకి మనస్సు పోకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి. 12 సార్లు చేసే ఈ వ్రతానికి వ్రత సిద్ధి కలుగుతుంది. మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్ఠం.

తర్వాతి అధ్యాయం ›

భక్తి ఆరాధన యాప్ తెరవండి →