వినాయక చవితి వ్రత కథ - వినాయక చవితి పూజ - చంద్రుని పరిహాసం
గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ. ఈ విషయమును విస్మరించిన ఒకనాడు కైలాసమున కుబ్జ రూపములో విహరించుచున్న గణేశుని చూచి చంద్రుడు ఆ వింతరూపమునకు విరగబడి నవ్వాడు. ‘నిన్ను చూచిన వారు నీలాపనిందల పాలగుదురు గాక’ అని గణపతి చంద్రుని శపించాడు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు. భాద్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించాడు.
ఇది ఎల్లరికి విధి. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకోపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడింది.