పదహారు సోమవారాల వ్రత కథ - పదహారు సోమవారాల వ్రతం - సోమవార వ్రత మహిమ, విధానం
నైమిశారణ్యములో జ్ఞాన యజ్ఞ నిరతులైన శౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి ‘ఓ మహర్షీ! మీరు మాకు అనేక సత్కథలు చెప్పితిరి. ఏ వ్రతమును ఆచరించుట వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమమైన వ్రతము నొకదాన్ని మాకు ఉపదేశింపు’ డని ప్రార్థించిరి.
అంతట సూతుడు ‘మహాత్ములైన మహర్షులారా! ఒక రోజు కైలాసములో దివ్య రత్న ఖచిత సింహాసనంపై కూర్చొనియున్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది.
’స్వామీ! నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వకాల సర్వావస్థలలోను అల్పప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతము నొకటి నాకు ఉపదేశించుడు‘
అది విని మందహాసముతో సదాశివుడు ’ప్రియా! నీ ప్రశ్న ఉచితముగాను, లోకోపకారిగాను ఉన్నది. లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్ఠమైన వ్రతమును చెప్పెదను‘ అంటూ ఇలా చెప్పసాగాడు.
నక్షత్రములలో సూర్యుడు, గ్రహములలో చంద్రుడూ నదులన్నింటిలో గంగానది, ఇంద్రియములలో మనస్సు ఏవిధముగా శ్రేష్ఠమైనదో, వ్రతములన్నింటిలో ఈ సోమవార వ్రతము శ్రేష్ఠమైనది. ఈ వ్రతమునకు ’షోడశ సోమవారవ్రతం‘ అని పేరు. దీని మహిమలను వర్ణించుట అసాధ్యము. భక్తి పూర్వకముగా దీనిని ఆచరించువారు ఏదేది కోరుకొందురో దానిని వారు శీఘ్రముగా పొందుతారు. దరిద్రులు ధనవంతులు అవుతారు. కన్నియలు యోగ్యులైన వరులను పొందుతారు. ముత్తైదువలు అఖండ సౌభాగ్యమును పొందుతారు. రోగులకు సంపూర్ణారోగ్యము కలుగును, ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకొందురు. ఈవిధముగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము అని చెప్పెను.
అంతట పార్వతి ’స్వామీ! దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును అనుగ్రహింపుడు‘ అని ప్రార్థించెను.
’ప్రియా! ఇది భక్తి పూర్వకముగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతము నాచరించుటకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు (చతుర్మాసములు) ప్రాశస్త్యమైనవి. ఆ రోజులలో వచ్చు పదహారు సోమవారములలో ఈ వ్రతమును. సోమవారమునాడు ఉపవాసం ఉండాలి. (ప్రసాదం స్వీకరించుటలో తప్పులేదు.) ప్రాతః కాలముననే స్నానాది నిత్యకర్మలను ముగించుకొనవలెను. పుట్టమన్నుతో శివలింగము తయారు చేసుకొనవలెను. వెండి ఇత్తడి వంటి శ్రేష్ఠమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించ వచ్చును.
బిల్వపత్రములు, పుష్పములు, ధూపదీపాదులను, సిద్ధము చేసికొనవలెను. నైవేద్యము కొరకు గోధుమ నూకను వేపి ముద్దచేసి, దానికి కావలసినంత నెయ్యి, బెల్లము కలిపి, ఉండలను చేయవలెను. ఈ వ్రతము కావలసిన ప్రసాద మిదే. ప్రసాదమును శివునకు నైవేద్యము పెట్టి, దానిని మూడు భాగములుగా చేయవలెను. భక్తుల కొకటి, పశువుల కొకటి, ఈ వ్రతమును ఆచరించువారికి మూడవది పంచవలెను. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధముగా పదహారు సోమవారాలు శ్రద్ధా భక్తులతో ఆచరించవలెను. పదహేడవ సోమవారమున ఉద్యాపన చెయ్యవలెను. పదహారు సోమవారములందును, పూజించిన మట్టి లింగములను పదహేడవ సోమవారమునాడు జలము నందు వదిలివేయవలెను. ఆ రోజున పూజ, బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తి చేయవలెను.
ఈ విధముగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను.