ఓంభక్తి ఆరాధన

ఏకాదశి వ్రత కథ - ఏకాదశి - రుక్మాంగదుడి కథ

పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ, ప్రజలను కంటి పాపలవలె చూసుకుంటుండేవాడు. ప్రజలు కూడా ధర్మవర్తనులై జీవిస్తుండేవారు. ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది. పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలిసి ఓ పన్నాగం పన్నాడు. ఆ పథకం ప్రకారం, రంభ మోహినీ వేషధారిణియై, రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయాలి. ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా, మార్గమధ్యంలో తారసపడిన మోహినీ రూపంలోనున్న రంభను చూసిన రుక్మాంగదుడు మోహావేశపరవశుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడు. అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తియై ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది. అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. రుక్మాంగదుని వ్రతభ్రష్టుణ్ని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశినాడు తనతో దాంపత్యసుఖాన్ని పంచుకోమని చెప్పింది. అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు. అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమని ఆమె కోరింది. ఏకాదశి వ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్నకొడుకును చంపడానికి నిర్ణయించుకోగా, అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై, జరిగిన మోసాన్ని అతనికి వివరించి, రుక్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదించాడు.

తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది 'ఏకాదశి'. ఏకాదశి అంటే తిథులలో పదకొండవది. ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి. ఆవిధంగా సంవత్సరంలో ఇరవైనాలుగు ఏకాదశులు. చాంద్రమానం ప్రకారం, మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులొస్తాయి. ప్రతి ఏకాదశి ఓ పర్వదినమనే చెప్పొచ్చు. ఈ ఏకాదశి రోజు వ్రతం చేసి పరమాత్మునిపై మనస్సు నిలిపి నియమాలను పాటించినవారికి ఇహ పరాలు రెండూ కరతలామలకం.

లోకాస్సమస్తాస్సుఖినో భవంతు

‹ ముందు అధ్యాయం

భక్తి ఆరాధన యాప్ తెరవండి →