ఓంభక్తి ఆరాధన

ఏకాదశి వ్రత కథ - ఏకాదశి - అంబరీషుడి కథ

అంబరీషుడు నాభాగుని కుమారుడు. ఒక పర్యాయం, శ్రీమన్నారాయణుని అనుగ్రహం కాంక్షించి 24 ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి, ఆఖరి ఏకాదశీ వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసదీక్ష విరమించి, ద్వాదశి పారణ చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చెయ్యబోతుండగా దూర్వాస మహర్షి వస్తాడు. దూర్వాసుడికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నదీస్నానానికి వెళ్లి వస్తానని చెబుతాడు. స్నానార్థం నదికి వెళ్ళిన దూర్వాసుడు ఎంతకూ తిరిగి రాడు. ద్వాదశి ఘడియలు గడిచి పోతున్నాయని భావించి, ద్వాదశి ఘడియలు గడవక మునుపు దీక్ష విరమించడం కోసం భుజించక పోతే వ్రత భంగం జరుగుతుంది, భుజిస్తే అతిథిని భంగ పరచినట్లు అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు, సమారాధన చేసి, తాను శ్రీహరి పాదతీర్థాన్ని సేవించి, దీక్షా విరమణ చేస్తాడు. అప్పుడు దూర్వాసుడు నదీస్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయం గ్రహించి, అతిథి కంటే ముందు తిన్నందుకు ఆగ్రహోదగ్రుడై, తన జటలలో ఒక దానిని నేలపై కొట్టి మహాకృత్యను సృష్టించి అంబరీషుని మీదకు దానిని విడిచి పెడతాడు. అంబరీషుడు విష్ణు భక్తుడు అవడం వల్ల శ్రీమహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచి పెడతాడు. సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి, దూర్వాసుడి మీదకు వెడుతుంది. బ్రహ్మ, శివుడు కూడా దూర్వాసుడిని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు. చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును ప్రార్థిస్తాడు. మహావిష్ణువు దూర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుడినే శరణు వేడుకొమ్మని అంటాడు. అప్పుడు గతి లేక దూర్వాసుడు అంబరీషుడిని వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది.

ఏకాదశీ వ్రతం చేసిన వారిని శ్రీ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడుతాడనడానికి ఇది ఒక తార్కాణం.

తర్వాతి అధ్యాయం ›

భక్తి ఆరాధన యాప్ తెరవండి →