ఋషి పంచమి వ్రత కథ - ఋషి పంచమి - కుక్కా, ఎద్దూ కథ
పూర్వం విదర్భ దేశంలో శ్వేతజిత్తు, జయశ్రీ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళ కుమారుడు గంగాధరుడు. జయశ్రీ ఋతు ధర్మం పాటించేది కాదు. సదాచార సంపన్నులైన అందరిళ్ళకీ వెళ్ళి, వాళ్ళకి ఆ విషయం చెప్పకుండా దాచి, వాళ్ళ ఆచారాన్ని మంటకలిపి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆనందించేది. అశాస్త్రీయమైన వేళల్లో భర్తతో సంగమించేది. అతడు భార్యా విధేయుడు కావడం వల్ల ఆమె మాటకి ఎప్పుడూ అడ్డు చెప్పేవాడు కాదు.
ఆ తరువాతి జన్మలో శ్వేతజిత్తు ఎద్దుగా జయశ్రీ కుక్కగా జన్మించి, పుత్ర వ్యామోహం వల్ల గంగాధరుడి ఇంటికే చేరారు. వారిద్దరికీ జంతువులైనా సరే, పూర్వ జన్మ స్మృతి ఉంది. గంగాధరుడు సదాచార సంపన్నుడు. ఒకరోజు అతడు తల్లి తండ్రులకి శ్రార్ధం పెడుతూ ఉండగా పాయసం పాము తాగింది. అది తింటే అందరూ చనిపోతారని, కుక్క వెళ్ళి వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆ పాయసాన్ని తాకింది. వారు కుక్కని కొట్టి, మళ్ళీ శ్రార్ధ ప్రక్రియ చేశారు. శిక్షగా కుక్కకి ఆ రోజంతా భోజనం పెట్టలేదు. ఆ రాత్రి ఆ కుక్క ఎద్దు దగ్గరకి వెళ్ళి కన్నీరు కారుస్తూ ‘నాథా, తల్లికి భోజనం పెట్టక పస్తు ఉంచాడు, వీడి శ్రార్ధం ఏం ఫలిస్తుంది?’ అంది. ఎద్దు కూడా విలపిస్తూ, ‘నేడు శ్రార్ధ దినమైననూ నా చేత ఉదయమంతా పొలం దున్నించారు. ఆహారం పెట్టడం మరిచారు’ అని వాపోయాడు.
సకల శాస్త్ర పారంగతుడైన గంగాధరుడు ధ్యానంలో ఉండగా అది వినిపించి అతడి మనో వీధిలో ఆ శబ్దాలకి అర్థం స్ఫురించింది. వెంటనే తల్లి తండ్రులకి భోజనం పెట్టి మరునాడు ఋషులని అడిగాడు. అప్పుడు వారు ఋషి పంచమి వ్రతం ఆదేశించగా, అది తన భార్య చేత చేయించి ఆ ఫలితాన్ని తల్లి తండ్రులకి ధారపోయగా వాళ్ళు స్వర్గానికి చేరారు.