ఋషి పంచమి వ్రత కథ - ఋషి పంచమి - ఋషి పంచమి కథ
విదర్భ దేశంలో ఉత్తంకుడనే సదాచార సంపన్నుడు ఉండేవాడు. అతని ధర్మపత్ని సుశీల. అతడికి ఒక కూతురూ ఒక కొడుకూ ఉండేవారు. కూతురిని ఒక ఉత్తమ వరుడికి ఇచ్చి వివాహం చేశాడు. కొన్ని నెలలకే అల్లుడు మరణించి కూతురికి వైధవ్యం ప్రాప్తించింది. శోకతప్తులై గంగా తీరంలో ఆ కుమార్తెతో కల్సి నివసించసాగారు.
ఒక రోజు రాత్రి ఆ కుమార్తె ఒళ్ళంతా విషక్రిములు పాకడం చూసి సుశీల భయభ్రాంతురాలయ్యింది. అప్పుడు ఉత్తంకుడు తీవ్ర ధ్యాన సమాధిలోకి వెళ్ళి చూడగా ఆమె పూర్వ జన్మ కథ తెల్సింది.
ఆమె పూర్వ జన్మలో సదాచార పరుల ఇంటి జన్మించింది. కానీ యుక్త వయస్సు వచ్చాకా, ఋతు కాలంలో నియమాలు పాటించకుండా అందరి సదాచారాన్నీ మంటకలిపింది. ఆ జన్మలో ఋషిపంచమి వ్రతం చేయుచున్న స్త్రీలని అవమానించి, అపహాస్యం చేసి ఏడిపించేది. అందువల్లే ఈ జన్మలో ఈ సమస్యలు వచ్చాయి.
అప్పుడు ఋషి పంచమి రోజు ఆమెచేత ఉపవాసం చేయించి వ్రతం ఆచరింపచేశారు. వెంటనే రోగ విముక్తురాలయ్యింది. మరు జన్మలో సౌభాగ్యవతిగా ఆరోగ్యవంతురాలిగా జీవించింది.