అనంత పద్మనాభ వ్రత కథ - అనంత పద్మనాభ వ్రతం - కౌండిన్యుడు, సుశీల కథ
పూర్వం వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి సుశీల అని ఒక కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్దికాలానికే భార్య చనిపోతే అనుష్ఠానానికి భంగం రాకుండా మరలా వివాహం చేసుకున్నాడు. ఆ సవతితల్లి కూతురుని అనేకమైన బాధలు పెడుతూ ఉండేది. యుక్తవయస్సు రాగానే సుమంతుడు తన కూతురుని కౌండిన్యుడనే యోగ్యుడైన వరునకిచ్చి వివాహం చేశాడు. అత్తవారింటి వెళ్ళేముందు సారే చీరా పెట్టి కూతురుని పంపుదామంటే ఆ గయ్యాళి ఒప్పుకోలేదు. చివరకి ఆమెకి తెలీకుండా కొంచెం గోధుమ పిండిని మూటగట్టి కూతురుకిచ్చి పంపాడు.
క్రొత్తదంపతులిద్దరూ మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి సేదతీరుతూ ఉండగా, అక్కడ కొందరు స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకొని ఏదో వ్రతం చేస్తూ ఉండడం సుశీల గమనించి అదేమిటో, ఆ విధానం ఏమిటో చెప్పమని ఒక ముత్తైదువని అడిగింది.
అప్పుడు ఆ ముత్తైదువ, ‘దీనిని అనంత పద్మనాభ వ్రతం అని అంటారు. ఇది భాద్రపద శుద్ధ చతుర్దశినాడు చేయాలి. 14 ముడులున్న ఎర్రటి తోరం సిద్ధం చేసుకొని, ఎర్రటి చీర కట్టుకొని, కలశ స్థాపన చేసి, ఆ జలాలలోకి యమునని ఆవాహన చేయాలి. దర్భలతో సర్పాకృతిని చేసి దానిపై నారాయణుణ్ణి ఆవాహన చేయాలి. షోడశోపచారాలతో పూజించి, గోధుమపిండితో చేసిన పదార్థాన్ని నైవేద్యం పెట్టి, పాత తోరం విసర్జించి క్రొత్త తోరం ధరించాలి. ఎవరైనా సత్పురుషులకి భోజనం పెట్టి శక్తి కొలదీ దానం ఇవ్వాలి. అలా 14 ఏళ్ళు చేసి ఆఖరి ఏడాది పూజ అయ్యాకా, ఉద్యాపనగా 14 కుండలు దానం ఇస్తే చతుర్విధ పురుషార్థాలూ నెరవేరుతాయి’ అని చెప్పి సుశీలతో కూడా ఆ వ్రతం చేయించింది. సుశీల తన వద్దనున్న పిండినే స్వామికి భక్తితో సమర్పించగా ఆయన సంప్రీతుడయ్యాడు. ఆ వ్రత మహిమ వల్ల వారు వెళ్ళే దారిలో కౌండిన్యునికి ఒక యజమాని పని ఇచ్చాడు. అక్కడే స్థిరపడ్డారు. ఆ తరువాత అతడు వృద్ధిలోకి వచ్చి అనతికాలంలోనే శ్రీమంతుడయ్యాడు.
అతడిలో రానురానూ అహంకారం తలెత్తింది. ఒకనాడు భార్య చేతికున్న తోరం చూసి, ‘ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా?’ అన్నాడు. ఆమె చెంపలు వేసికొని, అనంత వ్రతం గురించి చెప్పి తమ అభివృద్ధికి కారణం అదే అని చెప్పింది.
అతడు పగలబడి నవ్వి, ‘మన అభివృద్ధికి కారణం నా శక్తి సామర్థ్యాలే తప్ప ఈ వ్రతాలూ పూజలూ కాదు’ అంటూ ఆ తోరం పీకివేసి నిప్పుల్లో పడేశాడు.
కొద్దికాలంలో అతడి జీవితంలో అన్నివిధాలా పతనం ప్రారంభం అయ్యింది. ఈలోపు వారింట దొంగలుపడి సర్వం దోచుకుపోయారు. అతడి అహంకారం అణిగి, అనంతుని దర్శించేదాకా ఉపవాసం ఉంటానని మ్రొక్కుకొని ‘అనంత పద్మనాభా దర్శనం ఇవ్వు’ అంటూ ఆర్తితో పగలనకా రాత్రనకా చెట్టూ పుట్టా తిరిగాడు. దారిలో ఒకచోట పూతా, కాయి లేని, ఒక్క పిట్టైనా వాలని మామిడి చెట్టుని చూసి ‘అనంతుడు ఎక్కడ?’ అని అడిగితే ‘నాకూ ఆయన దర్శనం దొరకలేదు. నీకు కనిపిస్తే నా దుస్థితి చెప్పు’ అంది.
మరొక చోట గడ్డి పరకైనా కొరకని ఆవునీ దూడనీ చూసి అదే ప్రశ్న అడిగితే అవికూడా అలానే సమాధానం చెప్పాయి. మరోచోట రెండు కొలనులు కనిపించాయి. ఒకదానిలో నీరు ఒకదానిలోకి ప్రవహిస్తోంది. అక్కడ ఒక్క కొంగైనా వాలట్లేదు. అవీ అలానే చెప్పాయి. ఆ తరువాత ఒక గాడిదా ఏనుగూ కనిపించి అలానే చెప్పాయి.
చివరకి తిరిగీ తిరిగీ సోషవచ్చి ‘స్వామీ నన్ను నీ దగ్గరకి తీసుకోవూ?’ అని రోదిస్తూ పడిపోయాడు. అప్పుడు ఒక వృద్ధుడు కనిపించి, అతడిని లేవనెత్తి సేద తీర్చి ఒక భవనానికి తీసుకెళ్ళాడు. అక్కడ సింహాసనంపై ఒక దివ్య మంగళ మూర్తి వెలిగిపోతూ ఉండగా చూసి కౌండిన్యుడు భక్తిపారవశ్యంతో నమస్కరించాడు. అప్పుడు ఆయన ఆశీర్వదించి, ‘నేనే అనంతుణ్ణి, నీ భక్తికి సంతోషించాను. నీకు చతుర్విధ పురుషార్థాలూ, తదుపరి శాశ్వత వైకుంఠమూ అనుగ్రహిస్తున్నాను’ అన్నాడు.
అప్పుడు కౌండిన్యుడు తాను దారిలో చూసిన వింతలు చెప్పగా అనంతుడు నవ్వి ‘తనకి వచ్చిన విద్య ఎవ్వరికీ నేర్పకుండా జీవితమంతా వ్యర్థ వాదాలతో గడిపినవాడే మరు జన్మలో ఆ మామిడి చెట్టు – చవిటినేలని దానం ఇచ్చిన వాడు మరుజన్మలో మేత మేయని పశువు – ఒకరికొకరు దానాలు ఇచ్చి పుచ్చుకున్న అక్కా చెల్లెళ్ళే ఆ కొలనులు – క్రోధంతో కన్నూ మిన్నూ కానక అందరినీ అవమానించిన వాడే ఆ గాడిద, మదించిన మనిషి ఆ ఏనుగుగానూ పుట్టారు’ అని వాళ్ళ పూర్వజన్మలు చెప్పాడు. ‘స్వామీ వాటిని కటాక్షించు’ అని వేడుకుంటే, ‘నీ నిస్వార్థమైన కోరికకి సంతసించి వాటికీ విముక్తిని ఇస్తున్నాను. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా నిలుస్తావు’ అని దీవించి పంపాడు. అతడు ఇంటికి వెళ్ళి భార్యతో పురుషార్థాలన్నీ అనుభవించి ఆఖరికి వైకుంఠ ప్రాప్తిని పొందాడు.
అని కృష్ణుడు ఈ వ్రత కథని చెప్పగా విన్న పాండవులు కూడా ఈ వ్రతాన్ని చేసి యుద్ధంలో విజయం సాధించి మళ్ళీ పట్టాభిషిక్తులయ్యారు.