శ్రీ గురు చరిత్ర - మొదటిరోజు పారాయణము - మొదటి అధ్యాయము
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః శ్రీ కులదేవతాయై నమః శ్రీ శ్రీపాద శ్రీ వల్లభ - శ్రీ నృసింహ సరస్వతీ- దత్తాత్రేయ గురుభ్యో నమః.
శ్లో॥ బాలార్క ప్రభమింద్రనీల జటిలం, భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం | బ్రహ్మళ్లైస్సనకాదిభిః పరివృతం సిదై స్సమారాధితం దత్తాత్రేయ ముపాస్మహే హృదిముదా ధ్యేయస్సదా యోగిభిః ॥
శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము
మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము. కాని తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి, భయము తొలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే వున్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కల్గుతాయి. ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది. అప్పుడు భయానికి, దుఃఖానికీ కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది. అంటే యీ జగత్తు మిధ్యయని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్త్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్త్వాన్ని బోధించడానికి అత్రిమహర్షి పుత్రుడై జన్మించి, శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు. యదువు మొ॥న వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్దరించాడు. ఆయనయే మరల శ్రీపాదవల్లభుడుగాను, తరువాత శ్రీ నృసింహసరస్వతియనే పేరుతోనూ అవతరించి, తన శిష్యులైన సిద్ధాదులనుద్ధరించాడు. పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికీ కృష్ణా - భీమా సంగమతీరంలోని గంధర్వపుర నివాసియై, స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు.
ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకతీతుడు, అక్రియుడు, కోరికలు లేని వాడు, అద్వితీయుడు. అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవాలని సంకల్పిం చాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత యీ జగత్తును సృష్టించి, దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మయందు సూక్ష్మరూపంలో దాగి యుంటారు. వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్తయైన బ్రహ్మ నుండి, స్థూలము, జడమూ అయిన స్తంభము వంటి వస్తువులు: సూక్షము, సజీవములూ అయిన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలూ మొదలుగా గల యీ చరాచర జగత్తూ యేర్పడ్డాయి. ఇలా యీ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు. ఇంద్రియాలు, వాటి విషయాలైన శబ్దము, స్పర్శ, రూపము, రసము (లేక రుచి), గంధము (లేక వాసన) లతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని యెవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన, దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు.. (హృదయశుద్ధి, సుస్థిరమైన తత్త్వజ్ఞానము, యోగాభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము (ధర్మనిష్ఠ), అహింస, సత్యము, క్రోధము లేకుండడం, త్యాగము. శాంతి, యితరుల దోషాలను ప్రకటించకుండడం, ప్రాణులయందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండడం, మృదు స్వభావము, లజ్జ (వలన అనుచిత కార్యములను చేయకుండడం), చాపల్యం లేకుండడము, సహనము, ఓరిమి, చెక్కు చెదరని యుక్తా యుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచనలేకుండడం, నిగర్వము - యీ శుభ లక్షణాలను దైవీసంపద అంటారని భగవద్గీత చెబుతున్నది.) అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవరూపంతో జన్మించాడు. ఇలా ప్రతియుగంలోనూ అవతరించి ధర్మ రక్షణము, స్వధర్మ పాలనమూ చేసి, తర్వాత తన అవతార శరీరాలు విడిచి పెడ తాడు. ఇలా బ్రహ్మదివసాన శ్వేత వరాహకల్పంలో యిప్పటికి 28 యుగ చతుష్టయాలు గడిచాయి. (432 కోట్ల సం॥లు ఒక బ్రహ్మదివసము. అది బ్రహ్మకు ఒక రోజు. దీనికి రెండింతలైన (బ్రహ్మ యొక్క) అహోరాత్రాల కాలం ఒక కల్పము. 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం. వీటిలో మొదటిది శ్వేత వరాహకల్పం.)
మానవులలో కలి ప్రభావం వలన సత్యము, ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలూ కొరవడ్డాయి. యజ్ఞదాన తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు గూడ మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మయైన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్దరించడానికి స్వయంగా అవతరించాడు. కృష్ణా- అమరజానదీ సంగమ తీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా యిప్పటికీ వున్నాడు..
ఈయన మహాత్మ్యం చెప్పనలవిగానిది. పుట్టినవెంటనే ఏడిచే బదులు ప్రణవ ముచ్ఛరించాడు. ఇనుమును తాకి బంగారంగా మార్చాడు. అక్షరాభ్యాసం గూడ లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానముపదేశించాడు. చిన్న వయసులోనే సర్వతీర్థ క్షేత్రాలూ పాదచారియై దర్శించి పావనం చేసాడు. అష్టాంగయోగమభ్యసించాడు. నానాటికీ పతనమవు తున్న సన్యాసమార్గాన్ని పునరుద్ధ రించాడు. అపథ్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలీ (ప్రయాగ, కాశీ, గయ) యాత్ర చేయించాడు. చచ్చినవాణ్ణి బ్రతికించాడు. గొడ్డు బజ్జెను పాడిగేదెగా చేసాడు. త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు. విద్వాంసుల విద్యాగర్వమణచాడు. తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యమిచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మమార్గం బోధించాడు. ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేసాడు. తన అమృతదృష్టిచేత ఒకనికి కుష్టురోగం తగ్గించాడు. ఒక దీపావళినాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళాడు. అకాలంలో కోసిన పంటచేనును మాటమాత్రం చేత తిరిగి సస్యసమృద్ధిగా మార్చాడు. ఇలాటి మహాకార్యాలు యిదివరకు చేసాడు; ఇప్పటికీ చేస్తున్నాడు; ఎప్పటికీ చేస్తాడు. ఆకాశంలోని నక్షత్రాలను, భూమిపైనున్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువు లనూ లెక్కపెట్టవచ్చునేమో గాని, ఆ భగవంతుని కల్యాణగుణాలను, శక్తులనూ లెక్కించడం సాధ్యం గాదు.
భగవంతుడు నిజానికి రూపంలేనివాడైనాగూడ తన మహిమ మరియు తన కల్యాణగుణాలరూపంలో అవతరించి భక్తుని చెవియనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి, అతని దుష్ట సంస్కారమనే పాపాన్ని దహించి వేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు, జీవించియుండగానే ముక్తుడవుతాడు. సుఖ దుఃఖాలనే ద్వందాల చేత స్పర్శించబడక, వాటిపట్ల నిర్లిప్తుడవుతాడు. ప్రారబ్ధకర్మరూపమైన అతడి దేహం నశించినా, నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖదుఃఖరూపమైన ద్వంద్వాలింకా మిగిలియున్నా, ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం లేనివారికి, యింద్రియసుఖలోలురైన ఆసురీ సంపదగల వారికి, తమోగుణ ప్రధానులైన మోహాంధులకూ యీ సత్యం తెలియదు. స్వధర్మ మాచరిస్తూ సాధు, గురు, దేవతలయందు భక్తిగలవాడై, సత్సంగం వలన వివేకియై 'నేనేకర్తనూ, భోక్తను' అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసియై ఈ మార్గంలోనే అతడు భుక్తి, ముక్తి పొందుతాడు.
గంగాధర సరస్వతీ స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము
శ్రీ గురుని అనుగ్రహానికి పాత్రుడై, 'సాకరే' అనుపేర ప్రసిద్ధికెక్కిన సాయందేవుడను సద్ర్భాహ్మణుడు మా పూర్వీకుడు. ఆయనది ఆపస్తంభశాఖ, కౌండిన్యస గోత్రము. వారి కుమారుడు దేవరావు. అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రిగారు. ఆయన శ్రీ గురునికి భక్తుడు. మా తల్లి యొక్క తండ్రిగారిది అశ్వలాయనశాఖ, కాశ్యపస గోత్రం. ఆయన జను, భగీరధ మహర్షులవంటివాడు. మా తల్లి చంపాదేవి, పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి, సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది. ఆ గంగాధరుని కుమారుడనైన నా పేరు సరస్వతి.
వేదాధ్యయనపరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపస్వులు, సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా! మీకు నా నమస్కారములు. నేను మీ పాదధూళివంటివాడను. రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశ పారం పర్యంగా శ్రీ దత్తానుగ్రహం వుండడం వల్లను, శ్రీ గురుని ప్రేరణవల్లనూ మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను. 'అమృత కుంభం వంటి శ్రీ గురుచరిత్ర నీకు ప్రసాదించబడినది. నీవీ కథ వ్రాయి. దానివలన నీకు, నీ వంశస్థులకూ గూడ సర్వమూ సిద్ధిస్తాయి' అని శ్రీగురుడు నన్నాజ్ఞాపించారు. భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతీ స్వామి ఆదేశం కామధేనువు వలె యీ కార్యాన్ని నెరవేర్చగలదు.
త్రిమూర్తియైన శ్రీ దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర అపారము. దానిని సంపూర్ణంగా చెప్పడం యెవరితరమూ గాదు. ఆయన ప్రేరణతో వ్రాసిన యీ గురు కథను పారాయణ, శ్రవణము చేసేవారి వంశం పవిత్రమై రోగాలు, పీడలు లేకుండా కలకాలం సిరిసంపదలతో శోభిస్తుంటుంది. దీని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి. ఇది నా స్వానుభవము. నేను అల్పుడ నైనప్పటికీ, శ్రీ గురుని అనుగ్రహం వలన నా నోటినుండి వెలువడే యీ దత్తాత్రేయ కథ - అల్పమైన తేనెటీగ నోటినుండి లభించే తేనెలాగ, విలువలేని ముత్యపు చిప్పనుండి లభించిన విలువైన ముత్యంలాగ, కాకి రెట్ట నుండి మొలచిన దివ్యమైన అశ్వత్థ (రావి) వృక్షంలాగ- అభీష్టాలు, జ్ఞానమూ గూడ ప్రసాదించగలదు.
ప్రస్తావన : ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచములోని సర్వమత గ్రంధాలు, మహనీయులూ చెబుతున్నారు. కాని పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు? ఆయనను గుర్తించడము ఎలా? అంతటి గురువు తారసిల్లినా, మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇనుప ముక్కకున్న తుప్పును తొలగించేదాక అయస్కాంతం వైపు ఆకర్షించబడదు గదా! స్వల్పంగా పాపం చేసిన వారికి జపధ్యానాలు, ప్రాయశ్చిత్తాలూ ఉపయోగపడతాయి. గాని, అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్త మని శాస్త్రం. మొదట ముముక్షువు 'గురుచరిత్ర' వంటి గ్రంధాలు పారాయణ, లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షుత్వము, గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష-తీవ్రతరమౌతాయి. అపుడే దైవకృపచేత సద్గురు సమాగమం జరుగుతుంది. ఈ గ్రంథమహిమ వలన స్వప్నంలో తానాశ్రయించ వలసిన సద్గురువెవరో తనకు తెలుపబడుతుంది. అంతవరకూ 'శ్రీ గురుచరిత్ర' పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు, నిరంతర ప్రార్ధనలు చేస్తూ, ముముక్షువు వేచియుండాలి. అపుడు మాత్రమే ఎట్టి సంశయానికీ తావులేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుందీ అధ్యాయం.
కథారంభము
గంధర్వనగరంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి మహిమ లోక ప్రసిద్ధమై, దూర దూర ప్రాంతాలనుండి గూడ యెందరెందరో వచ్చి వారిని సేవించి, పెళ్ళికానివారు పెళ్ళి, సంతానము లేనివారు సంతానము, పేదవారు ధనము - యిలా యెవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. వారిని దర్శించాలను కొన్నప్పటినుండే కోరినవి నెరవేరుతున్నవారున్నారు. నామధారకుడనే బ్రాహ్మణుడు యెన్నో కష్టాలకు గురియై, యెన్ని చేసినా ఒక్కటీ తీరక యెంతో వ్యాకులపడ్డాడు. ఆ పరిస్థితులలో అతడు శ్రీ గురుని మహాత్మ్యం గురించి విని, వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అది లభించకుంటే తన జీవితమే వ్యర్థ మని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ. ఆకలి దప్పులు గూడ మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనమవకుంటే ప్రాయోపవేశం చేసుకోదలచి అతడు శ్రీ గురుని స్మరించి యిలా మొరపెట్టుకున్నాడు.
"అందరి కష్టాలూ తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలెందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే, సర్వపాపహరమైన మీ నామం వాటినెందుకు నశింపజేయలేదు? అన్ని జీవులనూ కరుణించే మీరు నన్ను మాత్రం యెందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని, తలచిన వెంటనే ఫలితమిస్తాడనీ వేదాలు, స్మృతులూ చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చిందిగదా, మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడంలేదు? మీరు సాటిలేని పెన్నిధియన్నది నిస్సంశయంగా అందరి అనుభవమున్నూ! కాని నా మనస్సులో మీపై భక్తి యెందుకు కల్గడం లేదు? నా మనస్సు మీపై స్థిరంగా నిలవడంలేదేమి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడూ, నీడా అని నమ్మి యిపుడు మిమ్మల్నే ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరుపెట్టి నా తల్లిదండ్రులు, నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మా, మీరు దీనులపాలిటి కల్పవృక్షము, దయాళువూ, మహాదాత. దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? మీరు సర్వసాక్షియని వేదాలు చెబుతున్నాయి గదా! మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరినీ వుపేక్షించని మీరు నన్నెందుకు వుపేక్షిస్తున్నారు? నేను మీకేమీ సమర్పించలేదనా? సాక్షాత్తూ లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైన నేనేమి యివ్వగలను? బిడ్డనుండి యేమి తీసుకొని తల్లి స్తన్యమిస్తున్నది? నన్ననుగ్రహించే సమయం యింకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించనిమాట నిజమే. కాని సేవిస్తేనే ప్రసాదించేది దానమెలా అవుతుంది? 1 స్వామీ, లౌకికుడైన రాజు గూడ తన సేవకుల వంశంలో పుట్టినవారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకు లందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా ఋణం రాబట్టుకుంటాను. 2 మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటివారిపట్ల తగునేమో గాని, అల్పుడనైన నాయందు తగదు.
నిష్ఠ, ఓరిమిలతో గూడిన నిరంతర సేవ వలన మాత్రమే భక్తుని హృదయం శుద్ధమై, ఎప్పుడూ అన్ని జీవులపై వర్షిస్తుండే గురు కృప అనుభవమవుతుందని సాయిబాబా, రమణమహర్షి, అక్కల్కోట స్వామి వంటి మహనీయులందరూ చెప్పారు. అనుగ్రహమన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు ముందు సిద్దుడు గూడ యితడికి చెబుతాడు.
గురు భక్తుడు యే మహాత్ములను దర్శించినా తనకు గురు కృప లభించేలా ఆశీర్వదించమని కోరాలి.
ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో! అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపిలేడు; కాని మీవంటి పాపహారకుడూ లేడు. కనుక నన్నుద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్టూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రులైన మీరు - అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు - నన్ను బుజ్జగించాలి గాని, నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతోచెప్పవచ్చుగదా? 3 ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణుపొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివీ అయిన నీ కారుణ్యమేమైంది ప్రభూ మృత్యుముఖంలో వున్న నన్నెందుకు వుద్ధరించకుండా వున్నావు?" ఇలా దారిపొడుగునా నామధారకుడు అనేక విధాలుగా శ్రీ గురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు ఖిన్నుడై, శోషవచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టుక్రింద పడుకున్నాడు. అతనికి నిద్రతూగినపుడు కలలో గూడ అతడు శ్రీ గురుణ్ణి స్మరిస్తున్నాడు. ఆవు తననెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు, భక్తులపాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూతవేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు విభూతి, పులి చర్మమూ ధరించి యున్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి, వాటితో అభిషేకించి, గంధమలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి, అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలచింది. అపుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి, తలపై చేయి వుంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవమలానే వున్నది. 4 అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు. అక్కడ మరెవ్వరూ లేరు! అపుడతడు లేచి, తనకు స్వప్నదర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు.
3. అతడు చేసిన తప్పేమో ముందు ముందు సిద్ధుడు చెబుతాడు. అయినా దానిని గూడ మన్నించి శ్రీ గురుడు అతనికి త్వరలో స్వప్న దర్శనమిస్తాడు. సిద్ధుని దర్శనం, సన్నిధి ప్రసాదిస్తాడు.
4. ఈ రీతిన శ్రీ గురుడు అతడు కోరినదానికి శతకోటి రెట్లు అధికంగా అనుగ్రహించి అతనిని తన శిష్యునిగా అంగీకరించారు. స్వప్నంలో లభించే గురు దర్శనము. గురు కృప ఉత్తమమైన శుభసూచనలని శాస్త్రాలు చెబుతున్నాయి.
శ్రీ దత్తాయ గురవే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః.