ఓంభక్తి ఆరాధన

పదహారు సోమవారాల వ్రత కథ - పదహారు సోమవారాల వ్రతం - మార్కండేయ, సాంబ, పూజారి కథలు

మహాతపస్వియైన మృకండునకు సంతాన ప్రాప్తి కలుగక పోగా ఆతను తపస్సు చేసి సదాశివుని పుత్ర భాగ్యము కొరకు ప్రార్థించెను. శివుడు ప్రత్యక్షమై ‘మహర్షీ! నీకు పదహారు సంవత్సరముల ఆయువుగల సజ్జనుడైన కుమారుడు కావలెనా? నూరు సంవత్సరములు ఆయువుగల అధమ పుత్రుడు కావలయునా?’ అని ప్రశ్నించెను. ఋషి ‘నాకు పదహారు సంవత్సరముల ఆయువుగల సత్పుత్రుడు చాలు’ అనెను. శివుని అనుగ్రహంతో ‘మార్కండేయుడు’ అనే సత్పుత్రుడు జన్మించెను. ఆయువు మిగియచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యెను.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించెనన్న అపవాదు వచ్చెను. దాని నివారణకొరకై అతను జాంబవంతుని పై విజయము సాధించి, మణిని సంపాదించి, జాంబవతిని పరిణయమాడెను. సంతానము లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతము ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను. బిడ్డకు సాంబ అని పేరు పెట్టిరి.
శివపార్వతులు భూలోకమున సంచరించుచు, ఒక సారి వైశ్యుడు, వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడ నారంభించిరి. అందు శివునకు అపజయము కలిగెను. ‘వైశ్యుడే గెలిచె’ నని పూజారి అసత్యము పలికెను. పార్వతికి కోపము కలిగెను. అసత్యము పలికిన అర్చకుని తత్ క్షణమే కుష్ఠురోగి కమ్మని శపించెను. అర్చకుడు వికృత రూపుడయ్యెను. ‘శివ, శంకరా’ అని అరుస్తూ అతను క్రింద పడిపోయాడు. అంతట సుందరియైన ఒక వనిత ప్రత్యక్షమై ‘పదహారు సోమవారముల వ్రతమును ఆచరించుము. దీనివలన నీ రోగము నయమగును’ అని పలికెను. అర్చకుడు అలాగే చేశాడు. ఆతని వికృత రూపం తొలగిపోయింది. పదహారు సోమవారముల వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్ఠునివారణ మయ్యెను. అనంతరము శివుని కృపవలన శివ సాన్నిధ్యమును పొందెను. మార్కండేయ పురాణమునందు చెప్పబడిన శివపార్వతి సంవాద రూపము నున్న పదహారు సోమవారాల వ్రతకథ సంపూర్ణం.

‹ ముందు అధ్యాయం

భక్తి ఆరాధన యాప్ తెరవండి →